అంచనాలను అధిగమించిన హెచ్డీఎఫ్సీ
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ తొలి త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభాలను 26.80శాతం పెంచుకుని, రూ.2,796.92 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.2,204 కోట్లగా ఉన్నాయి. రూ.11,397.29 కోట్లగా ఉన్న మొత్తం ఆదాయాలు రూ.13,516.99 కోట్లకు పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయలు(వడ్డీ ఆదాయాలకు, వడ్డీ చెల్లింపులకు తేడా) సైతం 9శాతం ఎగిసి, ఏడాది బేసిస్తో రూ.2,229.15 కోట్లగా నమోదైనట్టు తెలిపింది.
జూన్ క్వార్టర్ ముగిసేనాటికి ఈ ఫైనాన్స్ కంపెనీ లోన్ బుక్ కూడా రూ.2.65 కోట్లకు పెరిగి, గతేడాది కంటే 14.92శాతం ఎగిసినట్టు హెచ్డీఎఫ్సీ తన ఫలితాల్లో ప్రకటించింది. ఈ త్రైమాసిక కాలంలో మొత్తం రూ.5,108 కోట్ల రుణాలను కార్పొరేషన్ అమ్మినట్టు, దానిలో రూ.3,296 కోట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు విక్రయించినట్టు వెల్లడించింది. 12.3 కోట్ల హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్సూ కంపెనీ ఈక్విటీ షేర్లను తన పార్టనర్ ఎర్గో ఇంటర్నేషనల్ ఏజీకి అమ్మినట్టు, దానివల్ల రూ.921.61 కోట్ల ప్రీ-టాక్స్ లబ్దిని పొందినట్టు ఈ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. అసెట్ క్వాలిటీ స్థిరంగా ఉన్నట్టు, స్థూల నిరర్ధక ఆస్తులు 0.75 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ సేర్లు 1.48 శాతానికి ఎగిసి, రూ.1,398గా నమోదయ్యాయి.