
శిష్యుడి ‘అవినీతి’పై హజారే ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: ఓ ల్యాండ్ సెటిల్మెంట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ.2కోట్లు లంచం తీసుకున్నారన్న మాజీ మంత్రి కపిల్ మిశ్రా వ్యాఖ్యలతో రాజధానిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కపిల్ ఆరోపణల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆప్ ఆరోపిస్తుండగా, అవినీతిని చీపురుతో ఊడ్చిపారేస్తానన్న కేజ్రీవాల్ తానే అవినీతిపరుడయ్యాడంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇక కేజ్రీపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై ఆయన గురువు అన్నా హజారే ఆచితూచి స్పందించారు.
ఆదివారం రాలేగావ్‌సిద్ధిలో మీడియాతో మాట్లాడిన అన్నా హజారే.. కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు బాధాకరమన్నారు. ‘అవినీతిని రూపుమాపేందుకే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటిది ఆయనే లంచం తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. నిజంగా ఇది బాధాకరం’ అని హజారే అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ గరం గరం..
కేజ్రీవాల్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఆదివారం ఉదయం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన తర్వాత పొలిటికల్ సీన్ వేగంగా మారింది. కేజ్రీవాల్‌ను తూర్పారపట్టడంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీపడ్డాయి. యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు సీఎం కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించగా, సీఎంను బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు వినతిపత్రం అందించారు.
(కేజ్రీవాల్‌పై బాంబు పేల్చిన మిశ్రా)