న్యూఢిల్లీ: ప్రాథమిక విద్య అందిరి హక్కులానే అందరికి ఆరోగ్యం త్వరలోనే దేశ పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటి కానుంది. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని రెండేళ్ల క్రితమే నేషనల్ హెల్త్ పాలసీ ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్ లో ఉన్న ఈ ఫైలును ప్రస్తుతం ఆరోగ్యమంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. వచ్చే నెల మొదటివారంలో ఈ ఫైలుకు కేబినేట్ ఆమోదముద్రవేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంపై కేబినేట్ కు నోట్ ను సిద్ధం చేసి పంపినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ డిపార్ట్ మెంట్లు 'ఆరోగ్యం'ను ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చడంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వివరించారు. దీంతో పాటు జాతీయ ఆరోగ్య హక్కు చట్టం(ఎన్ హెచ్ఆర్ఏ) కింద ఆరోగ్యాన్ని విస్మరించడం కూడా నేరంగానే పరిగణించాలని చట్టంలో పొందుపరిచారు.ప్రస్తుతం దేశ స్థూల జాతీయాదాయంలో ప్రజారోగ్యానికి సంబంధించిన ఖర్చులు 1.2 శాతంగా ఉండగా, రాబోయే కాలంలో 2.5 శాతానికి చేరుకుంటుందని ఎన్ హెచ్ ఆర్ఏ తెలిపింది.
దేశవ్యాప్తంగా గర్భిణీ, శిశు మరణాలను తగ్గించడం, సామాన్య ప్రజలకు ఉచిత మందులు అందుబాటులో ఉంచడం తదితరాలు బిల్లులో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆరోగ్యపరంగా ఉన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కేంద్ర ప్రభుత్వం వీటికి మార్పులు చేసే అవకాశం ఉంటుంది. బిల్లు కేబినేట్ లో ఆమోదం పొందిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు మెకానిజమ్స్, గైడ్ లైన్స్, అజెండా తదితరాలను ప్రభుత్వ శాఖలు చూసుకుంటాయని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.