ఎండలు మండిపోతున్నాయి.. గత పాతికేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో మండిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో సరిగ్గా 25 ఏళ్ల నాటి ఎండల రికార్డు తాజాగా బద్దలైంది.
ఎండలు మండిపోతున్నాయి.. గత పాతికేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో మండిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో సరిగ్గా 25 ఏళ్ల నాటి ఎండల రికార్డు తాజాగా బద్దలైంది. డెహ్రాడూన్, పంత్‌నగర్, ఉధమ్‌సింగ్‌నగర్ ప్రాంతాలలో ఎండలు మండిస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం అక్కడ ఎండలు 35-36 డిగ్రీల స్థాయిలో ఉన్నాయి. 1991 మార్చి 31వ తేదీన పంత్‌నగర్‌లో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు అదే అత్యధికం, అయితే, శుక్రవారం నాడు దాన్ని అధిగమించి 36.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాఖండ్ రాజధాని నగరమైన డెహ్రాడూన్‌లో ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు పెరిగింది.
2001 తర్వాత అక్కడ ఇంత స్థాయిలో ఉష్ణోగ్రత నమోదుకావడం ఇదే మొదటిసారి. సగటు ఉష్ణోగ్రతల కంటే అన్నిచోట్లా 6-8 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు. మరికొన్ని రోజుల పాటు ఎండలు ఇలాగే ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయని, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తాయని అంటున్నారు. దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నాయి. ఎండ వేడి ఎక్కువగా ఉంటున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ వారం మొదట్లో హెచ్చరిక జారీచేసింది. గుజరాత్‌లో అయితే ఈ వారం ప్రారంభంలో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.