మృత్యుగాలి.. మళ్లీ వస్తుందా? | heat waves in Telangana, AP claims many lives | Sakshi
Sakshi News home page

మృత్యుగాలి.. మళ్లీ వస్తుందా?

Published Sat, Mar 18 2017 1:36 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

మృత్యుగాలి.. మళ్లీ వస్తుందా? - Sakshi

మృత్యుగాలి.. మళ్లీ వస్తుందా?

- రెండేళ్ల కిందట తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన వడగాడ్పులు
- 2015 మే చివర్లో ఆంధ్ర, తెలంగాణలో 2,500 మంది మృత్యువాత
- భూతాపం కారణంగా పదేళ్లకోసారి పునరావృతమయ్యే ప్రమాదం
- కొంతమేరకైనా కాపాడుతున్న హైదరాబాద్‌పై కాలుష్యం దుప్పటి
- లేకుంటే రెండేళ్లకోసారి పెను వడగాడ్పుల విజృంభణ
- వడగాడ్పులపై భారత్, విదేశీ వాతావరణ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
- ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధం కావాలంటున్న పరిశోధకులు  


సరిగ్గా రెండేళ్ల కిందట.. వేసవిలో మే చివరి వారం.. ఒక్కసారిగా వడగాడ్పులు ఉధృతమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం పిట్టల్లా రాలిపోయారు. ఏకంగా 2,500మంది వడగాడ్పుల దెబ్బకు అసువులుబాశారు. ఈ ప్రాంతంలో ఆ స్థాయి వడగాడ్పులు వందేళ్లకోసారి వస్తాయని అంచనా. కానీ భూతాపం పెరగడం వల్ల ఈ ప్రమాదం ఏకంగా పది రెట్లు పెరిగిపోయిందని వాతావరణ నిపుణుల అంచనా. అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పదేళ్లకోసారి ఆ స్థాయి వడగాడ్పులు వీచే ప్రమాదం పొంచి వుంది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్‌ మహానగరం, పరిసరాల మీద నింగిలో దట్టంగా ఆవరించి ఉండే కాలుష్యం దుప్పటి తొలగిపోతే.. ఆ భీకర వడగాడ్పుల ముప్పు ప్రతి రెండేళ్లకోసారి ముంచుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ముందుగా గుర్తించ గలిగితే ప్రయోజనం
వడగాడ్పులు, భూతాపానికి సంబంధం ఉందని సూత్రప్రాయంగా చెప్పటం సరిపోదని.. ఇటువంటి పెను వడగాడ్పులు ఏ నెలలో రావచ్చు, ఎన్ని రోజులు కొనసాగవచ్చు అనేది ముందస్తుగా అంచనా వేయగలిగితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోగలదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విపత్తు నిర్వహణ విభాగ అధికారి నాగేంద్ర కె. బియానీ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఏదేమైనా వడగాడ్పులను ఎదుర్కోవడానికి తాము ఎప్పుడూ ప్రణాళికలు రచిస్తామని చెప్పారు. కానీ ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పుల వల్ల జబ్బుపడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్యను చూస్తే.. ఈ ప్రణాళికలు సరిపోవట్లేదన్నది స్పష్టమవుతోంది. ‘అహ్మదాబాద్‌ వడగాడ్పు కార్యాచరణ ప్రణాళిక’ మంచి మార్గదర్శకమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ 2010లో వడగాడ్పుల మరణాల సంఖ్య 700గా ఉంటే 2015 నాటికి అది 20కి తగ్గిపోయింది. అటువంటి ప్రణాళికనే విజయవాడ కోసం అభివృద్ధి చేసినట్లు బియానీ తెలిపారు. అయితే ఈ విషయంలో వివిధ మంత్రిత్వశాఖలు, నగర పాలక సంస్థలోని వివిధ విభాగాల మధ్య చాలా సమన్వయం అవసరమవుతుందన్నారు.

తేమ శాతం పెరిగితే మరింత తీవ్రం...
గాలిలో తేమ శాతం (హ్యుమిడిటీ) ఎక్కువగా ఉండటం వల్ల వడగాడ్పుల ప్రభావం మరింత తీవ్రమవుతుందని ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకుడు కృష్ణా అచ్యుతరావు వివరించారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ఎట్‌ బర్కిలీ, లారెన్స్‌ బర్కిలీ నేషనల్‌ లేబొరేటరీ పరిశోధకులతో కలసి తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్లు చెప్పారు. 2015 మే నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెను వడగాడ్పుల వెంటనే పాకిస్తాన్‌లోని కరాచీలోనూ అదే తరహా వడగాడ్పులు విజృంభించాయి. అక్కడ 700 మంది మృత్యువాతపడ్డారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పుల సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే కరాచీలో వడగాడ్పుల సమయంలో ఉష్ణోగ్రతలు ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అయినా కరాచీలో వడగాడ్పుల తీవ్రతకు ప్రధాన కారణం.. అక్కడ వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ తేమ శాతం 20 శాతంగా ఉంటే.. కరాచీలో 35 శాతం నుంచి 70 శాతం వరకూ నమోదైంది. తేమ శాతం ప్రభావంపై ఉత్తర అమెరికా, యూరప్‌ దేశాల్లో ప్రత్యేక సూచికలు ఉంటాయి. కానీ అవి దక్షిణాసియా దేశాలకు వర్తించవు. ఈ నేపథ్యంలో దక్షిణాసియాకు వర్తించేలా ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ తదితర వివరాలతో కూడిన వేడి సూచికలను అభివృద్ధి చేయడానికి పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఇటువంటి సూచికలు ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందించడానికి దోహదపడతాయి.

మానవ కల్పిత భూతాపంతో లింకు...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను గడగడలాడించిన 2015 నాటి భీకర వడగాడ్పుల మీద అధ్యయనం చేసిన భారత, విదేశీ వాతావరణ నిపుణులు మూడు ప్రధాన సూత్రీకరణలకు వచ్చారు. ఆ పరిశోధకుల బృందంలో ఒకరైన యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌ కార్స్‌టెన్‌ హాస్టీన్‌.. ‘ఆ పెను వడగాడ్పులకు మనుషుల వల్ల జరిగిన వాతావరణ మార్పుకు సంబంధం ఉంద’నేందుకు బలమైన ఆధారాలు కనుగొన్నట్లు చెప్పారు. వాతావరణ ప్రమాదాలపై అవగాహన పెంపొందించే అంశం మీద ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఢిల్లీలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ అధ్యయన నివేదికను అమెరికన్‌ మెటియోరాలాజికల్‌ సొసైటీ బులెటిన్‌లో ప్రచురణ కోసం సమర్పించారు.

కాలుష్య దుప్పటిని తొలగిస్తే మరింత వేడి...
‘మున్ముందు ఇప్పటికన్నా మరింత తీవ్రమైన వడగాడ్పులు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధం కావాల్సి ఉంది. అలాగే పారిశ్రామిక కార్యకలాపాలు, రవాణా వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యాలను శుభ్రం చేసినట్లయితే.. మరింత బలమైన వడగాడ్పులు వస్తాయి. గతంలో ఉత్తర అమెరికా, యూరప్‌లలో ఇదే విధంగా జరిగింది’ అని ఆ సమావేశంలో పరిశోధకులు హెచ్చరించారు. దక్షిణాసియా భూభాగాన్ని ఎక్కువగా కప్పి ఉంచే కాలుష్యం దుప్పటి.. సూర్యుడి వేడిమిలో కొంతైనా భూ ఉపరితలాన్ని తాకకుండా నిరోధిస్తోంది. అయితే దీనర్థం గాలి కాలుష్యం మంచిదని కాదు. గాలి కాలుష్యం ఏటా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందిని బలితీసుకుంటోంది. వర్షపాతంపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ కాలుష్యాన్ని శుభ్రం చేసే క్రమంలో మరింత అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు ముందుగా సిద్ధం కావాలి.

- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ (దథర్డ్‌పోల్‌.నెట్‌ సౌజన్యంతో)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement