ఆ కోహ్లిని చూసి ఈ కోహ్లి షాక్ తిన్నాడు!
ఇటీవల ముగిసిన భారత్-న్యూజిల్యాండ్ మూడో టెస్టులో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు ఒకేసారి ఇద్దరు విరాట్ కోహ్లిలు దర్శనమిచ్చారు. ఒకరేమో ప్రేక్షకులు ఉండే స్టాండ్స్‌లో.. మరొకరు మైదానంలో.. డాషింగ్ బ్యాట్స్‌మన్‌ను రెండుచోట్ల చూడటంతో అభిమానులు విస్తుపోయారు.
ఇంకా విచిత్రమేమిటంటే ఒరిజినల్ విరాట్ కోహ్లి కూడా అచ్చం తనలాంటి వాడు ప్రేక్షకుల మధ్య కనిపించడంతో బిత్తరపోయాడు. అతన్ని చూసి.. తనను తాను అద్దంలో చూసుకున్నట్టు ఫీలయ్యాడేమో.. కోహ్లికి నవ్వు ఆగలేదు. చేయి అడ్డం పెట్టుకొని మరీ చప్పట్లు కొడుతూ నవ్వుల్లో మునిగిపోయాడు.
ఇండోర్‌లో జరిగిన భారత్-న్యూజిల్యాండ్ మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్టాండ్స్‌లో అచ్చం కోహ్లిలాగా ఉండే ఆయన డూప్ ఒకరు హల్‌చల్ చేశారు. అచ్చం కోహ్లి పోలికలతో ఉన్న ఆ వ్యక్తితో సెల్ఫీలు తీసుకోవడానికి ఒకవైపు ప్రేక్షకులు పోటెత్తారు. ఈ డూప్లికేట్ కోహ్లి వెంట అభిమానులు పడిన దృశ్యం కెమెరా కంటపడింది. మైదానంలో పెట్టిన టీవీ స్క్రీన్‌లలో తరచూ కనిపించిన ఈ దృశ్యాన్ని చూసి నిజమైన కోహ్లి ఒకింత విస్తుపోయాడు. ఆ తర్వాత పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు. ఈ సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఈ వీడియోను ఐదులక్షల మందికిపైగా చూడగా.. 6,400సార్లు దీనిని నెటిజన్లు షేర్ చేసుకున్నారు.