22 లక్షల జాబ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి!
ఈ-రిటైల్ దిగ్గజం అమెజాన్ అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏడాదికి రూ. 22 లక్షలు జీతం ఆఫర్ చేస్తూ జాబ్‌ను ఇవ్వజూపింది. కానీ అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. తన కలల ఐఏఎస్ కొలువు కోసం అంతటి ఆఫర్‌ను తృణప్రాయంగా త్యజించాడు. అతనే హర్యానాకు చెందిన హిమాన్షు జైన్. తాజా సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 44వ ర్యాంకు సాధించిన ఈ కుర్రాడు హైదరాబాద్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో కంప్యూటర్ సైన్స్ పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ వెంటనే అతనికి అమెజాన్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి జాబ్ ఆఫర్లు వచ్చాయి.
కానీ, తన జీవితగమ్యం కార్పొరేట్ కంపెనీల్లో కొలువు చేయడం కాదని హిమాన్షుకు అనిపించింది. అందుకే అమెజాన్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడే ప్రారంభంలో రూ. 22లక్షల జీతంలో ఉద్యోగం ఇస్తామని ఆ సంస్థ ఆఫర్ చేసినా.. హిమాన్షు తిరస్కరించాడు. ఆ తర్వాత రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ అతని మనస్సు నిలువలేదు. అతనికి ఐఏఎస్ ఉద్యోగం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం.
'ఒక ఐఏఎస్ అధికారి దేశంలో మార్పు తీసుకురాగలడని మా కుటుంబసభ్యులు, టీచర్లు ఎప్పుడూ చెప్పేవారు. అప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా పెట్టుకున్నా' అని చెప్పిన హిమాన్షు.. ఆర్బీఐలో సైతం ఉద్యోగం వదిలేసి సివిల్స్‌కు సిద్ధమయ్యేందుకు ఢిల్లీ వచ్చాడు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ను అధిగమించినా.. మెయిన్స్‌లో విఫలమయ్యాడు. మూడో ప్రయత్నంలో రెట్టించిన ఉత్సాహంతో, మరింత అకుంఠిత దీక్షతో సివిల్స్ రాసి అనుకున్నది సాధించాడు. 44వ ర్యాంకు సాధించిన ఈ యువకెరటం కలలను నిజం చేసుకోవాలంటే అవి సాకారమయ్యే వరకు వాటిని వెంటాడుతూనే ఉండాలని చెప్తున్నాడు.