వారి కోసం హృదయద్వారాలు తెరిచాడు
ముంబై: మతానికి, మానవత్వానికి ఉన్నది చిన్న విభజన రేఖే. మనుషులను మతాలుగా, వర్గాలుగా వేరుచేసే ఆ విభజనరేఖను అధిగమిస్తే.. మానవత్వం గుబాళిస్తుంది. విశ్వ మానవాళి శ్రేయస్సును ఆకాంక్షిస్తుంది. ఒకవైపు దేశంలో 'దాద్రి' ఘటనతో మత ఉద్రిక్తతలు తలెత్తుతుంటే.. ఓ మానవతావాది ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేందుకు తన దుకాణాన్ని సమకూర్చి.. అలాంటి మానవత్వాన్నే చాటాడు. ముంబైలోని ధారావిలో ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేందుకు ఓ హిందూ వ్యాపారవేత్త తన దుకాణంలో వీలు కల్పించాడు..
ధారావిలోని ముకుంద్ నగర్లో ఓ పురాతన చిన్న మసీదును ఇటీవలే మూసివేశారు. దానిని పునర్నిర్మించాలని నిర్ణయించారు. అయితే మసీదును మూసివేయడంతో స్థానికంగా ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్లాలనే ప్రశ్న తలెత్తింది. వెంటనే వారి దృష్టి దిలీప్ కాలేపై పడింది. దిలీప్ కాలే జాజ్ 'లెదర్స్ ఇన్ సియెన్' పేరిట ఓ లెదర్ షాపును నడిపిస్తున్నారు. అదేవిధంగా మసీదు అభిముఖంగానే మరో షాపు కూడా ఆయనకు ఉంది. జై బజరంగ్ భళి బిల్డింగ్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో 2,500 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ షాపుకు ప్రస్తుతం అధునాతన హంగులు చేయిస్తున్నారు. ఈ షాపులో నమాజ్ నిర్వహించుకోవడానికి ముస్లింలు అడగ్గానే ఆయన వెంటనే అంగీకరించారు.
"మా మసీదు చాలా పురాతనమైనది. చిన్నది. దానిని పునర్నిర్మాణ పనులు మార్చ్లో ప్రారంభించాం. దాంతో మాకు ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ఎక్కడ స్థలం దొరకలేదు. దీంతో దిలీప్ కాలే మా అభ్యర్థనను పెద్ద మనసుతో అంగీకరించారు' అని ముకుంద్ నగర్ లోని నూర్ మసీదుకు చెందిన హజి షౌకత్ అలీ తెలిపారు. "వారు నా సహాయం కోసం వచ్చారు. వాళ్లు ఉపయోగించుకునేందుకు నా షాపును ఇచ్చాను. ఏంతైనా వీళ్లంతా నా మనుషులే. మేమంతా ఈ ప్రాంతంలో గత 40 ఏండ్లుగా కలిసి నివసిస్తున్నాం' అని దిలీప్ కాలే చెప్తారు. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఈ దుకాణంలో ఆయన టైల్స్ కూడా వేయించారు.