లక్నో: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్రమంత్రి బేణి ప్రసాద్ వర్మ మరోసారి వార్తలకెక్కారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని హిట్లర్‌తో, ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌ను ముస్సోలినితో పోల్చారు. ఓట్లను కొల్లగొట్టేందుకు వీరిద్దరి రహస్య అజెండాతో ముందుకువెళ్తున్నారని విమర్శించారు. ‘‘భారత రాజకీయాల్లో హిట్లర్ పుట్టాడు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ముస్సోలిని జన్మించాడు. వారిద్దరూ ఇప్పుడు మోడీ, ములాయం రూపంలో మళ్లీ పునర్జన్మ ఎత్తారు. ఈ హిట్లర్, ముస్సోలిని వల్లే ఇటీవల ముజఫర్‌నగర్‌లో అల్లర్లు జరిగాయి’’ అని వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో మోడీ నియంతలా మారారని, ఆయన ముందు ముస్లింలు నోరెత్తే సాహసం చేయలేరని పేర్కొన్నారు.
‘‘ఆ హిట్లర్‌కు భయపడి చివరికి ఆరెస్సెస్, బీజేపీలో కూడా ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేరు. మోడీని 2014 ఎన్నికల ప్రచార సారథిగా ప్రకటించిన గోవా సభలకు వెళ్లని అద్వానీ.. ఈ రోజు ఆయన చేపట్టే ‘ఐక్యతా పరుగు’ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ జపం చేస్తున్న మోడీ... గాంధీని మాత్రం పక్కనపెడుతున్నారు. సర్దార్‌ను హోంమంత్రిగా చేసింది గాంధీయే అన్న సంగతి గుర్తుంచుకోవాలి’’ అని బేణి అన్నారు. కాగా, బేణి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయనను సొంత పార్టీయే సీరియస్‌గా తీసుకోదని ఎద్దేవా చేసింది. ముందుగా మోడీ స్థాయి, అయన ప్రజాదరణ గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిదని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ అన్నారు.