టీఆర్‌ఎస్‌పై కోపం.. కుర్చీలపై ప్రతాపం!
- ధర్నాచౌక్‌లో ‘విధ్వంసం’పై హోంమంత్రి ఫైర్
- జేఏసీ, విపక్షాలపై నాయిని మండిపాటు
హైదరాబాద్: నగరంలోని ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్‌ను తరలించే విషయమై స్థానికులు, జేఏసీ నేతృత్వంలోని విపక్షాలకు మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే జేఏసీ, విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని, ధర్నా చౌక్ పేరుతో రాజకీయాలకు దిగాయని మండిపడ్డారు.
ధర్నా చౌక్ తరలించాలని స్థానికులు, ‘ఆక్యుపై ధర్నా చౌక్’ పేరుతో జేఏసీ సోమవారం ఒకేసారి ఆందోళనకు దిగడం, స్థానికులపై వామపక్ష కార్యకర్తల దాడి, అనంతరం విపక్షాలపై పోలీసుల లాఠిచార్జ్ తదితర పరిణామాలతో ఇందిరాపార్క్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లిన సంగతి తెలిసిందే. వీటన్నింటిపై హోం మంత్రి నాయిని సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
‘ఇవ్వాళ ఎవరినీ అరెస్ట్ చేయబోమని పోలీస్ కమిషనర్ ముందే ప్రకటించారు. ధర్నా కోసం జేఏసీ అడిగినట్లే స్ధానికులు కూడా పర్మిషన్ అడిగారు. ఇద్దరికీ అనుమతి లభించింది. అయితే శాంతియుతంగా ధర్నా చేస్తోన్న స్థానికులపై కమ్యూనిస్టు కార్యకర్తలు దాడి చేయడం దారుణం. ధర్నా చేసేవాళ్లు ప్రజలను కొట్టడం ఏమిటి? ధర్నా చౌక్ కావాలని అడిగే హక్కు మీకున్నట్లే.. వద్దని నినదించే హక్కు వాళ్లకూ ఉంది’ అని మంత్రి నాయిని అన్నారు. టీఆర్‌ఎస్ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు విపక్షాల్లో దడ పుట్టించాయని, అభివృద్ధి జరిగితే ఇక మమ్మల్ని పట్టించుకోరనే దుగ్ధతోనే కుటిల రాజకీయాలకు కాల్పడుతున్నాయని విమర్శించారు.
ఇందిరా పార్క్ ప్రాంతంలో ధర్నా చౌక్ ఏర్పాటుచేసేనాటికి అక్కడ నివాస సముదాయాలు తక్కువగా ఉండేవన్న నాయిని.. ప్రస్తుతం అక్కడ ఇళ్లు, కాలనీలు పెరిగాయని, ధర్నాల వల్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ధర్నా చౌక్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేశారని చెప్పుకొచ్చారు. నేడు ధర్నా చౌక్‌లో కుర్చీలు విరగొట్టడం ద్వారా కోదండరాం, కమ్యూనిస్ట్, టీడీపీ, కాంగ్రెస్‌లు టీఆర్‌ఎస్‌పై ఉన్న కోపాన్ని తీర్చుకున్నారని నాయిని వ్యాఖ్యానించారు.