
‘బిల్లు’ కట్టలేని రఘువీరాకు కోట్లెలా వచ్చాయి? : బి.గుర్నాథరెడ్డి
అనంతపురం, న్యూస్‌లైన్ : ‘రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి రైతుబిడ్డనంటూ పగటివేషాలు వేస్తూ, నిజాయితీపరుడిలా ఫోజు కొడుతుంటాడు. వాస్తవానికి ఆయన పెద్ద అవినీతిపరుడు. రూ.వేల కోట్లు కొల్లగొట్టాడ’ని వైఎస్సార్‌సీపీ అనంతపురం ఎమ్మెల్యే బి.గుర్నాథరెడ్డి విమర్శించారు. అనంతపురంలోని తన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. 2004లో హిందూపురం, మడకశిరలోని రెండు కోల్‌డస్టోరేజీలకు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న రఘువీరా.. ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎలా పడగలెత్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన అక్రమాస్తులపై లోకాయుక్త, హైకోర్టు, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ‘జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే మడకశిర మండలం నీలకంఠాపురంలో 50 ఎకరాల ఆసామి రఘువీరా. ఆయన 2004కు ముందు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే... ఇప్పుడు రూ.వేల కోట్లు సంపాదిం చారు. పదేళ్లలో ఎనిమిదేళ్లు దుర్భిక్షం నెలకొంది.
రెండేళ్లు పెట్టుబడులు కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రఘువీరా ఏమి వ్యాపారం చేసి రూ.వేల కోట్లు సంపాదించారో వెల్లడించాలి. ఒకవేళ దుర్భిక్ష వ్యవసాయంలోనే ఇంత డబ్బు సంపాదించి వుంటే.. ఆ కిటుకేమిటో రైతులకూ చెబితే ఉపయుక్తంగా ఉంటుంది. రైతులకు దన్నుగా నిలుస్తారన్న నమ్మకంతో వైఎస్ రాజశేఖరరెడ్డి మేఘమధనం బాధ్యతలను రఘువీరాకు అప్పగిస్తే అందులోనూ అక్రమాలకు పాల్పడ్డారు. మంత్రి మాటలు నమ్మి జిల్లారైతులు భార్యల మెడల్లోని తాళిబొట్లను సైతం తాకట్టు పెట్టి పంటలు వేశారు. తీరా మంత్రి మేఘమథనం చేయకుండానే చేసినట్లు చూపి రూ.కోట్లను కొల్లగొట్టారు. రఘువీరాచేసే ప్రతి పనిలోనూ క్విడ్‌ప్రోకో ఉంటుంది. రూ.500 కోట్లతో చేపట్టిన నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పనులను దొడ్డిదారిన ఎల్‌అండ్‌టీకి దక్కేలాచేసి...ప్రతిఫలంగా కళ్యాణదుర్గంలో రూ.3 కోట్లతో ‘కళ్యాణదుర్గం భవన్’ పేరిట విలాసవంతమైన భవంతిని నిర్మింపజేసుకున్నారు.
ఆ భవనానికి ప్రహరీ ఖర్చే రూ.కోటి ఉంటుంది. 2009-10లో వ్యవసాయశాఖ మంత్రిగా ఏపీఎంఐపీ కింద జైన్ డ్రిప్ ఇరిగేషన్ సంస్థకు అధికంగా లబ్ధి చేకూర్చారు. ప్రతిఫలంగా నీలకంఠాపురంలో మంత్రికి చెందిన 44 ఎకరాల తోటకు డ్రిప్‌ను జైన్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆ సంస్థే మామిడి మొక్కలు నాటించి, ఫెన్సింగ్ కూడా వేయించింది. అనంతపురం జిల్లాకు చెందిన 50ఎకరాల రైతు హైదరాబాద్‌లో రూ.30కోట్లతో విశాలమైన భవనాన్ని నిర్మించుకున్నారు. అలాగే అనంతపురంలో ‘మడకశిర భవన్’ పేరుతో రూ.2కోట్ల విలువైన భనవం నిర్మించారు. ఆయన టాటా, బిర్లా, గోద్రెజ్, రిలయన్‌స వంటి సంస్థల అధినేతల తరహాలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక హైదరాబాద్‌లోని మహేంద్రగిరి హిల్‌సలో 23ఎకరాల భూమిని బినామీ పేర్లతో దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య రైతుననిచెప్పుకునే రఘువీరా.. బెంగళూరులోనూ భారీగా ఆస్తులు కూడగట్టారు. గతంలో మోతీమహల్ లాడ్జీలో 1/8 నుంచి 1/9వ వంతు వాటా మాత్రమే ఉండేది.
ఇవాళ బెంగళూరు నడిబొడ్డున రూ.350కోట్లతో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మిస్తున్నారు. మైసూరులో 60ఎకరాల ఫాంహౌస్, మంగళూరులో పోర్టు వద్ద బినామీపేర్లతో 11 ఎకరాల భూమి, ఒడిశా రాష్ట్రం కొంథమాల్ జిల్లాలో 1,200 ఎకరాల పామాయిల్ తోట కొన్నారు. హైదరాబాద్ శివారులో రూ.వంద కోట్ల విలువైన డిస్టిలరీ కొని.. అల్లుడికి బహుమతిగా ఇచ్చారు. రఘువీరా పుట్టపర్తి సత్యసాయి బాబా, పెనుకొండ కాళేశ్వర్ ఆస్తులను కూడా కొల్లగొట్టారు. ఈ క్రమంలో బాబా మరణించిన విషయాన్ని మూడురోజుల వరకూ కప్పిపెట్టారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బాబా అచేతనంగా ఉండటాన్ని నేను గమనించా. అక్కడి వాతావరణం చూస్తే బాబా శివైక్యం చెందారని అన్పించింది. చివరకు సీఎం కిరణ్‌ను రప్పించిన రఘువీరా సత్యసాయిట్రస్టు సభ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నాక బాబా మరణాన్ని ప్రపంచానికి వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లూ నేను ఈ అంశంపై నోరు మెదపలేదు. చివరకు ఆర్డీవోలు, తహశీల్దార్ స్థాయి అధికారుల బదిలీల విషయంలోనూ మంత్రి భారీగా ముడుపులు దండుకున్నారు.
రఘువీరా కుమార్తె వివాహాన్ని పారిశ్రామికవేత్తలు, సినీనటులు, టాటా, బిర్లా లాంటి పెద్దల తరహాలో హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా చేశారు. బెంగళూరు, నీలకంఠాపురంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లలో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఓ సామాన్య రైతు కుమారుడు ఏవిధంగా ఆ స్థాయికి ఎదిగారో ప్రజలకు వివరించాలి. కోట్లాది రూపాయలు సులభంగా కూడబెట్టడంలో దాగిన రహస్యాన్ని రైతులకు చెబితే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఉండద’ని అన్నారు. లోకాయుక్త, హైకోర్టులు తన లేఖను సుమోటోగా స్వీకరించి... దర్యాప్తు చేయిస్తే రఘువీరా అక్రమాల బాగోతం బయటపడుతుందన్నారు. ఆయన అక్రమాస్తులను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.