2004కు ముందు కోల్డ్ స్టోరేజీ కరెంట్ బిల్లు కట్టలేని ఎన్.రఘువీరా రెడ్డి మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని నేడు వేల కోట్ల రూపాయిలు అక్రమంగా సంపాదించారని అనంతపురం ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి ఆరోపించారు. రఘువీరారెడ్డి ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని మహేంద్రగిరి హిల్స్లో 23 ఎకరాలను ఆయన ఆక్రమించారన్నారు. బెంగళూరులో రూ. 350 కోట్లతో స్టార్ హోటల్ నిర్మించారన్నారు. ఒరిస్సాలో 1200 ఎకరాలు కొనుగోలు చేసి వాటిలో పామాయిల్ తోటలు వేశారన్నారు. మైసూర్ సమీపంలో 60 ఎకరాల్లో ఫాంహౌస్ నిర్మించారని పేర్కొన్నారు. పుట్టపర్తి సత్యసాయిబాబా ఆస్తులను సైతం రఘువీరా రెడ్డి వదలలేదని తెలిపారు.
ట్రస్టుతో రహస్య ఒప్పందం తర్వాతే బాబా మరణించిన సంగతి వెల్లడించారన్నారు. పెనుగొండలోని కాళేశ్వర స్వామి ఆస్తులపై కన్నెసి వాటిని కూడా అక్రమించిన వైనాన్ని గుర్నాధ్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. మంత్రి రఘువీర ఆస్తులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి వెల్లడించారు.