ఉసేన్ స్పీడ్ వెనక రహస్యం ఏంటి?
స్ప్రింట్లో తనకు తిరుగులేదని జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ మరోసారి నిరూపించుకున్నాడు. బీజింగ్లో గోల్డెన్ డబుల్తో సత్తా చాటాడు.. అయితే.. బోల్ట్కు మాత్రమే ఇదెలా సాధ్యమైంది? అతను బుల్లెట్లా దూసుకెళ్లడం వెనక రహస్యమేంటి?
2008లో ఒలింపిక్స్లో పసిడి పండించడంతో మొదలుపెట్టి.. ఇప్పటి వరకూ ప్రంపచ ఛాంపియన్ షిప్, ఒలింపిక్స్.. ఆటేదైనా.. మెడల్ మాత్రం బోల్ట్ దే.. కేవలం ఒక్కసారి ఫాల్స్ స్టార్ట్ కారణంగా రేసులో పాల్గొనలేకపోవడం మాత్రమే దీనికి మినహాయింపు. మామూలుగా వేగంగా పరిగెత్తాలంటే.. కాళ్లు వేగంగా కదిలించాలి.. అథ్లెట్లు కాని వారు చేసే పని ఇది. కానీ బోల్ట్ మాత్రం వేరే చిట్కా పాటిస్తాడు.
అగ్రశ్రేణి స్ప్రింటర్లు కూడా మామూలు రన్నర్స్ లాగానే కాళ్లు కదిలిస్తారని.. అమెరికాకు చెందిన శాస్త్ర వేత్త డాక్టర్ ఎలెన్ ఒక ప్రయోగంలో నిరూపించారు. అయితే.. వీళ్లు మామూలు వాళ్లకంటే పెద్ద పెద్ద అంగలు వేస్తారని తేల్చారు. ఉదాహరణకు మామూలు రన్నర్లు వంద మీటర్ల రేస్ పూర్తిచేయడానికి 50 నుంచి 55 అంగలు ఉపయోగిస్తే.. అగ్రశ్రేణి రన్నర్ కేవలం 40 అంగల్లో పూర్తి చేస్తాడు.. ఇక్కడే మిగతా వారికి బోల్ట్ కూ తేడా. మామూలుగా అగ్రశ్రేణి అనుకునే వాళ్ల కంటే కూడా తక్కువగా.. బోల్ట్ తన 100 మీటర్ల రేస్ పూర్తి చేసేందుకు కేవలం 35 అంగలు తీసుకుంటాడు. అదే బోల్ట్ను మిగతావారి కంటే ముందు రేస్ పూర్తి చేసేందుకు సహాయపడుతుంది.
అంతే కాదు.. సాధారణంగా అగ్రశ్రేణి రన్నర్ ప్రతి అంగలో భూమి మీద కాలు మోపే కాలం 0.12 సెకండ్లు కాగా.. బోల్ట్ కేవలం 0.8 సెండ్లు మాత్రమే నేల మీద కాలు పెడతాడు. మిగతా వారితో పోలిస్తే బోల్ట్ 10 నుంచి 15 శాతం ఎక్కువ సమయం గాలిలో ఉంటాడు. వీటన్నింటికీ బోల్ట్ ఎత్తు ఒక కారణమైతే.. బోల్ట్ శరీరాకృతిలో జన్యుపరమైన తేడాలు.. అతడి వేగాన్ని పెంచేందుకు సహకరిస్తాయి. అదండీ.. బోల్ట్ వేగం వెనక కథ.