నేను భారమైతే చచ్చిపోతా: స్టీఫెన్ హాకింగ్
తాను భరించలేని బాధకు గురైన పక్షంలో...ఇక తాను ప్రపంచానికి చేయగలిగిందీ ఏమీ లేదని భావిస్తే...ముఖ్యంగా తనను ప్రేమించే వారికి తాను భారమైతే ఇతరుల సహకారంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమేనని ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ బతికే హక్కు ఉన్నట్లే.. చనిపోయే హక్కు కూడా ఉండాలని భావించే హాకింగ్, ప్రముఖ కమెడియన్ డారా ఓ బ్రియేన్‌కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ‘ది డెయిలీ టెలిగ్రాఫ్’ వెల్లడించింది.
తాను అప్పుడప్పుడు ఒంటరితనానికి గురవుతున్నానని కూడా అందులో ఆయన చెప్పారు. ఇటీవల ఏమైనా ప్రశ్నలకు తన నుంచి సమాధానం ఆశిస్తున్నవారు అసహనానికి గురవుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయన్నారు. ఈ ఇంటర్వ్యూను జూన్ 15వ తేదీన బీబీసీ వన్ ప్రసారం చేయనుంది. ఇందులో హాకింగ్ 45 ఏళ్ల కూతురు లూసీ, 36 ఏళ్ల కుమారుడు టిమ్ కూడా తన తండ్రి పరిశోధనల గురించి వివరిస్తారు. హాకింగ్‌ను వెన్నంటి రక్షించుకుంటున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా తదనంతర చర్చల్లో పాల్గొంటారు.
73 ఏళ్ల స్టీఫెన్ హాకింగ్ గత నాలుగు దశాబ్దాలుగా అత్యంత అరుదైన ‘మోటార్ న్యూరోన్ డిసీజ్’ అనే కండరాల జబ్బుతో బాధపడుతున్నారు. 21వ ఏటనే ఈ వ్యాధికి గురైన ఆయన ఏడాదికి మించి బతికే అవకాశం లేదని నాడు డాక్టర్లు తేల్చారు. అయితే వాళ్ల మాటలను పట్టించుకోకుండా మానసిక స్థైర్యంతో ఆయన ఇంతకాలం జీవించే ఉన్నారు. ఈ జబ్బుతో ఇంతకాలం జీవించేవారు ప్రపంచవ్యాప్తంగా ఐదు శాతానికి మించిలేరని వైద్యులు చెబుతున్నారు. తనపట్ల ప్రేమ, ఆరాధ్య భావంతో తనను చూసుకుంటున్నవారిని తాను భారమైతే చనిపోవడానికి సిద్ధమేనని చెబుతున్న హాకింగ్, వాస్తవానికి విశ్వ రహస్యాల గుట్టును పూర్తిగా ఛేదించకుండా చనిపోయే ఉద్దేశం లేదని కూడా తన తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
భూమండలంపై ఇక బతకడం అనవసరమని భావించేవారికి చనిపోయే హక్కు ఉండాలని 2013లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హాకింగ్ వాదించారు. పట్టి పీడిస్తున్న వ్యాధి నుంచి కోలుకునే అవకాశం లేక, బాధను భరించలేని వారికి అత్మహత్యలో సహకరించేందుకు స్విడ్జర్లాండ్‌లో ‘డిగ్నిటాస్ సూసైడ్ క్లినిక్’ ఉంది. అక్కడికెళ్లి గత 16 ఏళ్ల కాలంలో 273 మంది బ్రిటన్లు ఆత్మహత్య చేసుకోగా, 920 మంది జర్మన్లు, 194 మంది ఫ్రాన్స్ దేశస్థులు ఆత్మహత్య చేసుకున్నారు.