ఐఏఎస్ వాణీ మోహన్ చేసింది తప్పే!
► విచారణ విధానం పాటించలేదు
►ఏకపక్ష తీర్పు ఇచ్చారు
►సీఎంకు చేరిన నివేదిక
అమరావతి: ఐఏఎస్ అధికారి వాణీమోహన్ తప్పు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక అందింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్ చంద్ర శర్మ ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్‌కు సమర్పించిన నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చేరింది. విశాఖపట్నంలో రూ. వంద కోట్ల విలువైన భూమి ప్రభుత్వానిదని అప్పటి విశాఖ జిల్లా కలెక్టరు కోర్టు తీర్పు ఇవ్వగా ఇది తమదేనంటూ ప్రయివేటు వ్యక్తి సెటిల్‌మెంట్ కమిషనర్‌కు అప్పీల్ చేసుకున్నారు. అప్పట్లో సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ హోదాలో ఉన్న వాణీ మోహన్ ఇరు వర్గాల వాదనలు వినకుండా ఇది ప్రభుత్వ భూమి అనడానికి ఆధారాలు లేవంటూ ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు.
దీనిపై విశాఖపట్నం అప్పటి కలెక్టరు యువరాజ్ కమిషనర్ అప్పీల్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. పక్కాగా ఈ భూమి ప్రభుత్వానిదని అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తమ వాదనను వినకుండా ఏకపక్షంగా ఈభూమి ప్రయివేటుదంటూ వాణీమోహన్ తీర్పు చెప్పారంటూ అప్పట్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆమెను సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ పోస్టు నుంచి ప్రభుత్వం తప్పించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్ చంద్ర శర్మను సీఎం ఆదేశించారు. ప్రయివేటు వ్యక్తుల అడ్వకేట్లు, ప్రభుత్వ అధికారులు అందరి వాదనలు విని వాస్తవాలను వాకబు చేసిన ఆయన వాణీమోహన్‌దే తప్పని తేల్చారు.
‘తీర్పు ఎలాగైనా ఇవ్వవచ్చు. అందులో తప్పొప్పుల గురించి చెప్పలేం. అయితే సెటిల్‌మెంట్ కమిషనర్ విచారణ విషయంలో పద్ధతిని సక్రమంగా పాటించలేదు. ప్రొసీజర్ పాటించకుండా తీర్పు ఇవ్వడం తప్పే...’ అని సీఎస్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భూవివాదం కేసు ప్రస్తుతం కమిషనర్ అప్పీల్స్ కోర్టు విచారణలో ఉంది.
విశాఖపట్నం నగరంలోని ఈ భూమి ప్రభుత్వానిదా? ప్రయివేటుదా అనే అంశంపై ప్రభుత్వ, ప్రయివేటు న్యాయవాదుల వాదనలు విని కమిషనర్ అప్పీల్స్ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఈ వివాదం నేపథ్యంలోనే ప్రభుత్వం వాణీ మోహన్‌కు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది. ప్రస్తుతం నివేదిక అందినందున ఈ అంశంపై ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశం ఐఏఎస్ అధికార వర్గాల్లో ఆసక్తిగా మారింది.