బ్యాంకుల రుణరేట్లు దిగొచ్చే సంకేతాలు!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు.. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు కొన్ని మెచ్యూరిటీలపై బల్క్ (అధిక విలువ కలిగిన) డిపాజిట్ రేట్లను పావు శాతం వరకూ తగ్గించాయి. తద్వారా రుణ రేటు తగ్గింపు సంకేతాలను ఇచ్చాయి. రూ. కోటికిపైగా డిపాజిట్లపై వడ్డీ రేటును పావు శాతం మేర తగ్గించినట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. తక్షణం ఈ తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రూ. ఐదు కోట్లు ఆ పైబడిన డిపాజిట్ రేటును బ్యాంక్ పావు శాతం వరకూ తగ్గించింది. మరో ప్రైవేటు రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కూడా ఈ నెలారంభంలోనే వివిధ మెచ్యూరిటీలపై స్థిర డిపాజిట్ రేట్లను పావుశాతం వరకూ తగ్గించిన సంగతి తెలిసిందే.
మొండిబకాయిల ప్రొవిజనింగ్ నిబంధనలు సరళతరం
బ్యాంకుల మొండి బకాయిలకు సంబంధించి బ్యాంకింగ్ ప్రొవిజనింగ్ (ఒక నిర్దిష్ట సంవత్సరంలో మొండి బకాయిలకు లాభాల్లో కేటాయించాల్సిన పరిమాణం) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సోమవారం సడలించింది. ప్రొవిజినింగ్ జరిగిన ఎన్‌పీఏలు వసూలయినప్పుడు, అప్పటికే అందుకు కేటాయించిన మొత్తంలో(ప్రొవిజినింగ్ బఫర్‌లో) 50 శాతాన్ని తిరిగి మొండిబకాయిలకు, నిరర్థక ఆస్తులకు ప్రొవిజినింగ్ రూపంలో కేటాయింపులుగా చూపించుకోడానికి బ్యాంకులకు అనుమతినిచ్చింది. ఇప్పటి వరకూ ఈ రేటు 33%గా ఉంది. దీనివల్ల తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో లాభాల్లో ప్రొవిజినింగ్‌కు కేటాయించాల్సిన పరిమాణం తగ్గి, సంబంధిత బ్యాంకులకు మరింత నిధుల లభ్యత(లిక్విడిటీ) సమకూరే అవకాశం ఏర్పడుతుంది.