
ఎన్నికల ప్రచారంపై.. పదేపదే టీవీల్లో చూపితే అనర్హతే : భన్వర్‌లాల్
ఎన్నికల ప్రచారంపై సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి
18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందాలి
ఎన్నికల సంస్కరణలు - ఓటింగ్ ప్రాధాన్యంపై సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో ఎలక్ట్రానిక్ మీడియా (టీవీ చానళ్ల)లో ఒకే పార్టీ, ఒకే అభ్యర్థిని పలుమార్లు చూపిస్తూ ప్రచారం చేస్తే అనర్హత వేటు తప్పదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారంపై ప్రత్యేక నిఘా ఉంచుతామని చెప్పారు. ఆయన గురువారం మాదాపూర్‌లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో ‘ఎలక్టొరల్ రిఫామ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్ (ఎన్నికల సంస్కరణల - ఓటింగ్ ప్రాధాన్యం)’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రచార సమయంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఏదేని పార్టీకి అనుకూలంగా టీవీ చానళ్లలో రోజంతా ప్రచారం చేస్తే దానికి అయ్యే ఖర్చును లెక్కించి ఆ అభ్యర్థి లేదా పార్టీ ఖాతాలో చేరుస్తామని తెలిపారు.
ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఒకే పార్టీ లేదా అభ్యర్థిని పదే పదే టీవీల్లో చూపిస్తే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. మంచి నాయకుడిని ఎలా ఎంచుకోవాలి అని విద్యార్థులు ప్రశ్నించగా.. గత ఐదేళ్ళలో తమతమ ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎలా జరుగుతోంది, పోలీస్ కేసులు లేదా కోర్టు వివాదాలు, ఎమ్మెల్యే అయినప్పటికీ - ఇప్పటికీ ఆస్తి వ్యవహారాలు ఏ విధంగా మార్పులు చెందుతున్నాయో గమనించి సరైన నాయకులను ఎంచుకోవాలని భన్వర్‌లాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ మేనేజింగ్ డెరైక్టర్ సురేష్ చిత్తూరి, సీఐఐ సిబ్బంది పాల్గొన్నారు.