నీలికాంతితో చురుకుదనం!
వాషింగ్టన్: నీలికాంతిలో ఎక్కువ సేపు గడపడం వల్ల మెదడు మహా చురుగ్గా పనిచేస్తుందట. రాత్రీ, పగలూ తేడా లేకుండా ఎప్పుడైనా సరే.. నీలికాంతిలో ఉంటే నిద్రమత్తు తక్కువగా ఉండటంతోపాటు చేసే పనిపై ఏకాగ్రతా పెరుగుతుందట. తక్కువ తరంగదైర్ఘ్యం గల నీలికాంతితో 16 మందిపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు తెలిశాయని అమెరికాలోని బ్రిఘామ్ అండ్ వుమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు వెల్లడించారు. వలంటీర్లను రోజూ ఆరున్నర గంటలపాటు నీలికాంతి ప్రసరిస్తున్న గదిలో ఉంచి కొన్ని పరీక్షలు పెట్టారు.
అదేసమయంలో ఎలక్ట్రోడ్ల సాయంతో వారి మెదడు ఎంత చురుకుగా పనిచేస్తోంది? నిద్రమత్తు ఎంత ఉంది? వంటి అంశాలను పరిశీలించారు. తర్వాత ఫలితాలను విశ్లేషించగా.. ఆకుపచ్చకాంతి వంటి ఇతర కాంతుల కన్నా నీలికాంతిలోనే మెదడు బాగా చురుగ్గా ఉంటున్నట్లు తేలింది. దీంతో పనిచేసే చోట నీలికాంతి బల్బులు అమరిస్తే.. ఉద్యోగులు అలసట నుంచి త్వరగా తేరుకుంటారని, రాత్రివేళల్లోనూ బాగా పనిచేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.