25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని వేర్పాటువాదులు దాదాపు 25 సంవత్సరాల తర్వాత తొలిసారి జూలై 13న సమ్మెకు పిలుపునివ్వకుండా వదిలేశారు. రంజాన్ మాసం సందర్భంగా వారంతా ఉపవాస దీక్షలు చేస్తున్న నేపథ్యంలోనే ఎలాంటి స్ట్రైక్ చేయకుండా ఆగారని తెలుస్తోంది. 1931 జూలై 13న శ్రీనగర్ సెంట్రల్ జైలు బయట జరుగుతున్న ఆందోళనను నిలువరించేందుకు ఆర్మీ జరిపిన కాల్పుల్లో దాదాపు 21 మంది నిరసన కారులు చనిపోయారు.
అప్పటి నుంచి అక్కడ జూలై 13న సెలవు దినంగా పాటిస్తుండగా.. కొందరు వేర్పాటు వాదులు మాత్రం ఆర్మీ చర్యకు నిరసనగా ఆ రోజు సమ్మె చేస్తారు. అమరుల దినంగా పాటిస్తారు. కాగా, ఈ సారి మాత్రం హుర్రియత్ కాన్ఫరెన్స్ ఫ్యాక్షన్స్ అధినేత సయ్యద్ అలీ షా జిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్, జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్ మహ్మద్ యాసిన మాలిక్ కలిసి ఈ సారి ఎలాంటి సమ్మె నిర్వహించకూడదని నిర్ణయించారు. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో తాము నిర్ణయం తీసుకున్నట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.