బంగారం దిగుమతులు భారత్‌కు భారం
బెంగళూరు: బంగారం దిగుమతులు పెరగడం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఎంతమాత్రం మంచిదికాదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి పేర్కొన్నారు. ప్యానల్ చర్చలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించినట్లు ఒక ప్రకటనలో ఐఐఎం బెంగళూరు పేర్కొంది. అయితే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) డెరైక్టర్ అమ్రేష్ ఆచార్య కొంత భిన్న వాదన చేసినట్లు కూడా ప్రకటన పేర్కొంది. ఐఐఎంబీలో జరిగిన చర్చా వేదికలో చక్రవర్తి వివరించిన అంశాలివి...
- ప్రపంచ మొత్తం స్థూల ఉత్పత్తిలో భారత్ వాటా 30%గా ఉన్న రోజుల్లో అంటే 2,000 ఏళ్ల క్రితం దేశానికి బంగారం ఒక ఆస్తి. కరెంట్ అకౌంట్ లోటును ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం దిగుమతులు భారత్‌కు మంచిదికాదు.
- ఈ విషయంలో ప్రజల మైండ్‌సెట్ మారడానికి అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది.
- బంగారాన్ని కట్నంగా ఇవ్వడం లేదా తీసుకోవడం, దేవాలయాలకు ఈ విలువైన మెటల్స్ సమర్పించడం వంటి అలవాట్లను మానుకోవాలి.
- ప్రపంచవ్యాప్తంగా బంగారం ప్రతికూల రిటర్న్స్ ఇస్తోంది. ఇది ఇక ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఆ మేరకు ప్రచారం జరిగే ఒక స్పెక్యులేషన్ ప్రొడక్ట్ మాత్రమే.
డబ్ల్యూజీసీ వైఖరి భిన్నం...
ఇదే చర్చలో పాల్గొన్న డబ్ల్యూజీసీ డెరైక్టర్ (ఇన్వెస్ట్‌మెంట్) అమ్రేష్ ఆచార్య భిన్న వాదనను విని పించారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లకు బంగా రం ఒక పరిష్కారంగా నిలబడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ దిశలో ఎటువంటి పాలసీ నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై చర్చ జరగాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్థిక వృద్ధికి మద్దతుగా దేశ బంగారం నిల్వలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై దృష్టి అవసరమన్నారు.