బంగ్లాదేశ్‌కు భారత్ ఫుల్ సపోర్ట్!
ఢాకా: రోహింగ్యాల విషయంలో బంగ్లాదేశ్ వైఖరికి పూర్తిస్థాయిలో భారత ప్రభుత్వం మద్దతు ఇస్తోందని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పొరుగుదేశానికి భరోసా ఇచ్చారు. సుష్మాస్వరాజ్ బంగ్లా ప్రధాని షైక్ హసీనాతో ఫోన్‌లో మాట్లాడి ఈమేరకు మద్దతు తెలిపారని హసీనా డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నజ్రుల్ ఇస్లాం మీడియాకు తెలిపారు. 'రోహింగ్యాల సమస్య బంగ్లాదేశ్‌కు మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఇది ఇప్పుడు ప్రాంతీయ అంశం నుంచి అంతర్జాతీయ సమస్యగా మారింది' అని పేర్కొన్నారు.
మయన్మార్ రఖైన్ రాష్ట్రంలో హింసాకాండ కొనసాగుతుండటంతో భారీగా వలసవస్తున్న రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో ఉన్న రోహింగ్యా శరణార్థులకు ఆహారం, ఆశ్రయం, వైద్యం, పారిశుభ్రత వంటి మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని రోహింగ్యాలకు మానవతా సహాయాన్ని అందించడంలో బంగ్లాకు అండగా ఉంటామని భారత్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.