ఢాకా: ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడాలని భారత్, బంగ్లాదేశ్‌లు మరోసారి ఆదివారం తీర్మానించాయి. అలాగే బంగ్లాదేశ్ అభివృద్ధికి భారత్ చేయూతనిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ భరోసానిచ్చారు. సంయుక్త సమాలోచక సంఘం (జేసీసీ) నాల్గవ సమావేశం కోసం రెండు రోజుల పర్యటన నిమిత్తం సుష్మ ఆదివారం బంగ్లాదేశ్ చేరుకున్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు. ‘ద్వేషం, హింస, ఉగ్రవాదాలను ఏ మాత్రం ఊపేక్షించకుండా మన రెండు దేశాలను కాపాడుకోవాలని మేం తీర్మానించాం.
ఉమ్మడి సమస్యలపై చర్చించాం. ఆ సమస్యలపై ఉమ్మడిగానే పోరాడుతాం’ అని సుష్మ అన్నారు. మూడు విడతల్లో బంగ్లాదేశ్‌కు భారత్ 8 బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ అక్కడ చేపడుతున్న అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు తమ సాయం ఉంటుందని పునరుద్ఘాటించారు. వాయవ్య బంగ్లాదేశ్ ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం బెంగాల్‌లోని సిలిగుడి, బంగ్లాలోని పర్బాతీపూర్ మధ్య పెట్రోలియం ఉత్పత్తుల రవాణా కోసం పైప్‌లైన్‌ను భారత గ్రాంట్ కింద నిర్మించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. రోహింగ్యాలపై కఠినంగా వ్యవహరించి తనకున్న మంచిపేరును చెడగొట్టుకోవద్దంటూ మయన్మార్ నాయకురాలు సూచీకి మోదీ సూచించారని సుష్మా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment