‘అస్త్ర’ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని ఆదివారం విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) వెల్లడించింది. దృష్టి క్షేత్రానికి ఆవల(బియాండ్ విజువల్ రేంజ్) గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని వెస్ట్రన్ సెక్టార్‌లోని ఓ నౌకాదళ స్థావరం నుంచి సుఖోయ్-30 యుద్ధవిమానం ద్వారా వాయుసేన పరీక్షించిందని, ఈ పరీక్ష అన్ని రకాలుగా విజ యవంతమైందని డీఆర్‌డీవో అధికారులు ప్రకటించారు. పరీక్ష విజ యవంతం కావడంపై శాస్త్రవేత్తలను డీఆర్‌డీవో చీఫ్ అవినాశ్ చందర్ అభినందించారు. త్వరలో అస్త్ర క్షిపణికి వాస్తవ లక్ష్య ఛేదన పరీక్ష నిర్వహించనున్నామని, తర్వాత స్వదేశీ తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో అమర్చనున్నామని తెలిపారు. అస్త్ర క్షిపణిని సుఖోయ్-30 యుద్ధ విమానం ద్వారా ప్రయోగించడం యుద్ధవిమానాల్లో క్షిపణి అమరికకు సంబంధించి కీలక మైలురాయని అన్నారు.
ఈ క్షిపణికి మరిన్ని ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, భారత్ స్వదేశీయంగా రూపొందించిన తొలి బీవీఆర్ ఎయిర్-టు-ఎయిర్ మిసైల్ అయిన అస్త్ర అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. గగనతలంలో సుమారు 20 కి.మీ. నుంచి 80 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది.