
7.5 కోట్ల కారు... అరకోటి బైక్!!
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో-2013’ సంపన్న వర్గాలనే కాకుండా సామాన్యులను సైతం ఆకర్షిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో-2013’ సంపన్న వర్గాలనే కాకుండా సామాన్యులను సైతం ఆకర్షిస్తోంది. అత్యంత ఖరీదైన కార్లు, బైకులతోపాటు విదేశాలకు చెందిన చాక్‌లెట్లు, బొమ్మలతోపాటు అలంకరణ సామాగ్రి సైతం ఈ ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం ఇక్కడ రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇది ఆదివారంవరకు కొనసాగుతుందని సీఈఓ కరణ్ బాంగే తెలిపారు.
ప్రదర్శనలో లంబోర్గిని కంపెనీకి చెందిన ‘మర్సిలెగో ఎల్‌పీ 640’ కారు ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 6400 సీసీతో నడిచే ఈ కారు ఖరీదు రూ. 7.50 కోట్లు. దీనిని క్రికెటర్ యువరాజ్ సింగ్ నుంచి సికింద్రాబాద్‌కు చెందిన సందీప్‌సింగ్ కొనుగోలు చేసి ప్రదర్శన కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అలాగే రూ. కోట్ల విలువ చేసే వి8 వింటేజ్ కారు, ల్యాండ్ రోవర్‌లతో పాటు గ్రామీణ రోడ్లు, పొలాల్లో కూడా ప్రయాణించగలిగే విదేశీ వాహనాలను ఇక్కడ ప్రదర్శిస్తుండడం గమనార్హం. అయితే వీటి విలువ రూ.25 లక్షల వరకు ఉంది. అలాగే బీఎండబ్ల్యు కంపెనీకి చెందిన ఎస్ 1000 మోటర్ బైక్ కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. దీని విలువ రూ. 45 లక్షలు. ఈ వాహనాన్ని కూడా సికింద్రాబాద్‌కు చెందిన సందీప్ ప్రదర్శనకు తీసుకొచ్చారు. ఇవే కాకుండా బెల్జియం తదితర దేశాలతోపాటు మన దేశీయ వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శనలో ఆకర్షిస్తున్నాయి. 50 బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాహన, వస్తు సామాగ్రిని ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
18 లక్షల వాచీ...అయినా కొనలేరు!
ఉల్సే నార్డిన్ కంపెనీ తయారు చేసిన లగ్జరీ వాచీ ఇది. దీని ఖరీదు రూ.18 లక్షలు. 34 వాచీలు మాత్రమే కంపెనీ తయారు చేసింది. అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ప్రదర్శనకు మాత్రమే ఉంచారు.