గుండె స్టెంట్ల ధరలను తగ్గిస్తూ ఎన్‌పీపీఏ తీసుకున్న నిర్ణయం రోగుల భద్రతకు ప్రమాదకరం అని సీఐఐ పేర్కొంది.
న్యూఢిల్లీ: గుండె స్టెంట్ల ధరలను తగ్గిస్తూ జాతీయ ఔషధ ధరల నిర్ధారణ సంస్థ(ఎన్‌పీపీఏ) తీసుకున్న నిర్ణయం రోగుల భద్రతకు ప్రమాదకరం అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. ఈ చర్య స్టెంట్లకు అధునాతన సాంకేతికతను పరిమితం చేస్తుందని, దీంతో వైద్యం నాణ్యత ప్రభావితమై వైద్య పర్యాటక రంగం చిక్కుల్లో పడుతుందని సీఐఐ మెడికల్ టెక్నాలజీ విభాగం చైర్మన్ హిమాన్షు బైద్ అన్నారు. సహేతుక ధరలను ఆశించామని కాని, తాజా నిర్ణయంతో వైద్య సాంకేతిక రంగం తీవ్ర నిరాశకు లోనైందని తెలిపారు.
తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొనడం వల్ల భారత స్టెంట్ల పరిశ్రమ రానున్న రోజుల్లో సవాళ్లు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. స్టెంట్ల ధరల నియంత్రణపై హృద్రోగ నిపుణులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరిపినా కూడా, రోగుల ప్రయోజనాల రీత్యా చేసిన సలహాలను ఎన్‌పీపీఏ పెడచెవిన పెట్టినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. ఈ నిర్ణయం అమలుకు సహేతుక గడువివ్వాలని ఎన్‌పీపీఏను సీఐఐ కోరుతోందని వెల్లడించారు.