
'మోడీ వద్ద మంత్రులకు స్వేచ్ఛ ఉంది'
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తోసిపుచ్చారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తోసిపుచ్చారు. ‘‘ఆయన మంత్రులకు ఎంతో స్వేచ్ఛనిస్తున్నారు. నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అందరి మాటా వినండి, అయితే దేశానికి మేలు చేసే నిర్ణయాలే తీసుకోండని ఉపదేశిస్తున్నారు’ అని మంగళవారం చెప్పారు. ఓ మంత్రి జీన్స్ వేసుకున్నందుకు మోడీ ఆయనను మందలించారని వార్తను కూడా జవదేకర్ తోసిపుచ్చారు. మోడీ కూడా జీన్స్ వేసుకున్న చిత్రాన్ని చూపుతానన్నారు.
చక్కగా వస్త్రధారణ చేసుకునే ఆయన జీన్స్ విషయంలో మందలించారని, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. మోడీ తన మంత్రులకు స్వేచ్ఛనివ్వడం లేదన్న ఆరోపణలను బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు కూడా తోసిపుచ్చారు.