
‘మహా’ నగరంపై మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరం గత కొన్నేళ్లుగా పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ‘హుడా’ నుంచి హెచ్‌ఎండీఏగా రూపాంతరం చెందాక ఇది మరింతగా పెరిగింది. భూముల లభ్యత, తక్కువ ధర, మానవ వనరులు, రవాణా, విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాల విషయంలో హైదరాబాద్ అనుకూలంగా ఉండటంతో పారిశ్రామిక, ఐటీ, విద్యా, వైద్య, కార్పొరేట్, సేవల రంగం బాగా విస్తరించింది. దీంతో అనతి కాలంలోనే హైదరాబాద్ మెట్రో నగరంగా అభివృద్ధి సాధించింది. అయితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను శాశ్వత రాజధానిగా లేదా పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా ప్రకటించనున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇరుప్రాంతాల వారూ హైదరాబాద్‌పైనే పట్టుబడుతుండటంతో.. హెచ్‌ఎండీఏ చర్చనీయాంశంగా మారింది.
అప్పులెవరికి..?
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే.. ఇప్పటికే నగరాభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ చేసిన అప్పు రూ. 1,100 కోట్లు, ఆదాయ పన్ను బకాయిలు రూ. 550 కోట్లను ఎవరు తీర్చాలన్నది ప్రశ్న. దీన్ని ఇరు ప్రాంతాల వారికి పంచితే.. పదేళ్ల తర్వాత సీమాంధ్ర ప్రాంతం వారు నగరాన్ని వీడాల్సి వస్తే అప్పు తీర్చేందుకు ఇష్టపడరు. ఒకవేళ శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే ఇరు ప్రాంతాల వారు సమానంగా స్వీకరించాల్సి ఉంటుందని ఓ వాదన. హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్‌ఎండీఏకు మొత్తం 7,400 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టింది.
అందులో వివిధ విద్యా సంస్థలకు, ఐటీ సంస్థలకు, పరిశ్రమలకు ఇప్పటికే 3,700 ఎకరాల భూమిని విక్రయించారు. మరో 3,700 ఎకరాల భూమి హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉంది. అది కూడా ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విడివిడిగా ఉంది. దాంతోపాటు ఒక్కో ప్రాంతంలో భూమి ధర ఒక్కో రకంగా ఉండటంతో దానిని ఏ ప్రాతిపదికన పంచుతారన్నది ప్రజల్లో ఉదయిస్తున్న ప్రశ్న. ఒకవేళ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న మిగతా నాలుగు జిల్లాల్లోని ప్రాంతాలను.. ఆయా జిల్లాల నుంచి పూర్తిగా తప్పించాల్సి ఉంటుంది. ఇది అంత సులువుగా తేలే వ్యవహారం కాదు. ఆయా జిల్లాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే అది మరో సమస్యగా తయారవుతుంది.
ఈ ప్రాజెక్టుల గతేమిటి?
హైదరాబాద్‌లో తలపెట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను హెచ్‌ఎండీఏ ప్రారంభించాల్సి ఉంది. కానీ, విభజన నేపథ్యంలో దీనిపై హెచ్‌ఎండీఏ తర్జనభర్జన పడుతోంది. మియాపూర్‌లో భారీ బస్ టెర్మినల్, బాటసింగారం, మంగళపల్లిల్లో తలపెట్టిన లాజిస్టిక్ పార్కులను ఇప్పట్లో ప్రారంభించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ‘పీవీ ఎక్స్‌ప్రెస్ వే’లో మూడుచోట్ల అసంపూర్తిగా ఉన్న ర్యాంపుల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే రూ.20 కోట్లు వెచ్చించాల్సి ఉంది. దీంతోపాటు నగరంలోని 14 ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఫ్లైఓవర్లకు ఇక మోక్షం లభించదని హెచ్‌ఎండీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే హ్యాబిటాట్ సెంటర్, సైన్స్ సిటీ, జవహర్‌నగర్‌లో ఎడ్యుకేషన్ హబ్ వంటి కొత్త ప్రాజెక్టులు ఇక మరుగున పడే పరిస్థితి కనిపిస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు జైకా నుంచి తీసుకొన్న సుమారు రూ. 11వేల కోట్లకు పైగా రుణాన్ని చెల్లించే వ్యవహారం కూడా ప్రధాన అంశంగా మారనుంది.