న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రైలు టికెట్లను ఇకపై ఆన్‌లైన్‌లో సులభంగానే బుక్ చేసుకోవచ్చు. రైలు టికెట్లను బుక్ చేసుకునేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కొత్త బ్లాక్‌బెర్రీ మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ-10 వినియోగదారులు ‘ఐఆర్‌సీటీసీ ఆప్’ అనే ఈ ఆప్‌ను బ్లాక్‌బెర్రీ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రతి నిమిషానికీ 7 వేల చొప్పున రోజూ 5 లక్షల టికెట్ల వరకూ బుక్ అవుతున్నాయని, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆప్‌ను విడుదల చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ యాప్ ను వినియోగించడం చాలా సులభతరంగా ఉంటుందని రైల్వే అధికారి స్పష్టం చేశారు.
ప్రతీ ఏటా 31 కోట్ల మంది ప్రయాణికులు పైగా రైల్వే రిజర్వేషన్ చేసుకుంటున్నారన్నారు.దీనిలో 55 శాతం మంది ప్రయాణికులు బుకింగ్ కౌంటర్లను ఆశ్రయిస్తుండగా, 37 శాతం మంది ఆన్ లైన్లో బుక్ చేస్తున్నారన్నారు. మిగతా 8 శాతం మంది ప్రయాణికులు టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద రిజర్వేషన్లు చేయించుకుంటున్నారన్నారు.