ఆ ఉద్యమం వెనుక ఐఎస్ఐ?
తమిళనాడులో ఉవ్వెత్తున ఎగసిన జల్లికట్టు ఉద్యమం చాలావరకు అహింసాయుతంగానే సాగినా.. చివర్లో మాత్రం ఒక్కసారిగా హింస ప్రజ్వరిల్లింది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఉద్యమాన్ని ఆపేయాలని సూపర్ స్టార్ రజనీకాంత్ పిలుపునిచ్చారు. అయితే.. ఈ ఉద్యమం వెనక ఐఎస్ఐ హస్తం ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్యం స్వామి అనుమానం వ్యక్తం చేశారు.
ముందంతా కేవలం విద్యార్థులు, యువత మాత్రమే ఉన్న ఈ ఉద్యమంలోకి ఐఎస్ఐ వచ్చిన తర్వాతే హింస చెలరేగిందని ఆయన అన్నారు. నిజాయితీగా ఉద్యమం చేస్తున్నవాళ్లు చాలామంది ఇప్పుడు అక్కడ లేరని.. దానికి బదులు సంఘవిద్రోహ శక్తులు అందులోకి ప్రవేశించాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జల్లికట్టు కోసం తాను ముందునుంచి పోరాడుతున్నానని, కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని దగ్గరుండి నిషేధించిందని అన్నారు. తాము ముందునుంచి ఆట పట్ల సానుభూతితోనే ఉన్నామని.. అయితే ఇప్పుడు తమకు శాశ్వత పరిష్కారం కావాలని వాళ్లంటున్నారు గానీ, అది ఎక్కడి నుంచి వస్తుందని స్వామి ప్రశ్నించారు.