నితీశ్ వెలివేతకు రంగం సిద్ధం?
- జేడీయూ నుంచి నితీశ్‌ను బహిష్కరిస్తాం: శరద్ యాదవ్ వర్గం
పట్నా: బీజేపీ- జేడీ(యూ) మళ్లీ చేతులు కలుపడంతో బిహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మహాకూటమిని వీడి.. మళ్లీ బీజేపీతో జత కట్టిన జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్ పై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత శరద్ యాదవ్‌తోపాటు పలువురు నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోని అసమ్మతి వర్గం నితీశ్‌కు వ్యతిరేకంగా ఓ కీలక నిర్ణయం తీసుకోబోతుందన్న సంకేతాలు అందుతున్నాయి.
ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని జేడీయూ అసమ్మతి వర్గం భావిస్తోంది. మహాఘట్ బంధన్(కూటమి) నుంచి బయటకు వచ్చేయటం 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును అవమానించటమే, అందుకే నితీశ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక చర్యకు పాల్పడ్డారంటూ అరుణ్‌పై నితీశ్ వేటు వేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే పార్టీపై పట్టుకోసం నితీశ్ ఈ నెల 19న పట్నాలో జాతీయ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో సీనియర్ నేత శరద్‌యాదవ్ కూడా రాష్ట్రం మొత్తం పర్యటించి పార్టీ నేతలతో భేటీకానున్నారు. ఒకవేళ ఈ రెండు వర్గాలు గనుక విడిపోయేందుకే మొగ్గు చూపినట్లయితే సమాజ్‌వాదీ లుకలుకలు, అన్నాడీఎంకేలో వర్గపోరు తరహాలోనే జేడీ(యూ) పంచాయితీ కూడా ఎన్నికల సంఘం ముందుకు చేరే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.