
బీజేపీలో చేరిన జీవిత, రాజశేఖర్
న్యూఢిల్లీ : సినీనటులు జీవితా రాజశేఖర్ దంపతులు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో వారిద్దరూ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ ప్రభంజనం కొనసాగుతుండటంతో వారు కమలం వైపు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వీరు...అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వెలువడ్డాయి. అయితే రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా జీవితా, రాజశేఖర్ తమ నిర్ణయం మార్చుకున్నారు.
అంతకు ముందు టీడీపీలో చేరేందుకు వీరిద్దరూ ఆసక్తి చూపినా.... ఆపార్టీ నేతలే కొందరు అడ్డుకున్నారు. దాంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా గుజరాత్లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహ ఏర్పాటుపై దక్షిణాది రాష్ట్రాల నాయకులతో బిజెపి ఇటీవల హైదరాబాద్లో ఒక వర్క్‌షాప్ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి జీవితా, రాజశేఖర్ హాజరయ్యారు. అప్పటి నుంచే ఈ దంపతులు కమలం వైపు మొగ్గు చూపుతున్నా... ఈరోజు అధికారికంగా బీజేపీలో చేరారు. కాగా ఈ మధ్యనే సీనియర్ నటుడు కృష్ణంరాజు కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.