జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్!
రిలయన్స్ జియో ఉచిత సేవలనుభవిస్తున్న కస్టమర్లకు శుభవార్త. డిసెంబర్ 3తో ముగియనుందనే ఉచిత 4జీ డేటా, వాయిస్ కాల్స్ ఆఫర్, మరో మూడు నెలలు పాటు పొడిగించే అవకాశాలున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పరిస్థితుల డిమాండ్ బట్టి ఉచిత సేవలను విస్తరించే అవకాశముందని పేర్కొంటున్నాయి. తాజా రిపోర్టు ప్రకారం ఉచిత డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులను మార్చి 2017 వరకు విస్తరించనున్నామని విశ్లేషకులకు రిలయన్స్ జియో తెలియజేసినట్టు సమాచారం. ట్రాయ్ నిబంధనల మేరకు, ఏ టెలికాం ఆపరేటర్ కూడా వెల్కమ్ ఆఫర్ కింద ఉచిత సేవలను 90 రోజుల కంటే ఎక్కువ రోజులు అందించడానికి వీలులేదు. దీంతో ట్రాయ్ నిబంధనల మేరకు ఈ సేవల కటాఫ్ తేదీని డిసెంబర్ 3గా కంపెనీ నిర్ణయించింది.
కానీ వినియోగదారులకు ఇచ్చిన వాగ్దానం మేరకు సేవలందించలేని పక్షంలో, కస్టమర్ల నుంచి చార్జీలను వసూలు చేయడం కూడా న్యాయవిరుద్ధమని కంపెనీ ఓ మేరకు ఉచిత సేవలు కటాఫ్ తేదీని పెంచే ఆలోచనలు ఉన్నట్టు సిగ్నల్స్ ఇచ్చింది. ఇంటర్కనెక్షన్ సమస్యలతో కస్టమర్లు నాణ్యమైన సేవలు అందుకోలేకపోతున్నారని, తాము అందింద్దామనుకున్న సేవలను కస్టమర్లు సరిగా వినియోగించుకోలేకపోతున్నారని రిలయన్స్ జియో స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ అధినేత అన్షుమాన్ థాకూర్ తెలిపారు. డిసెంబర్ తర్వాత ఉచిత సేవలు కొనసాగించడానికి ట్రాయ్ నుంచి తమకు అనుమతి అవసరం లేదని కూడా థాకూర్ వ్యాఖ్యానించారు.
జియో సేవలు లాంచ్ చేసినప్పటి నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా వివిధ రకాల ప్రమోషనల్ ఆఫర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ అందిస్తుందని సిటీ రీసెర్చ్ రిపోర్టుచేసింది. సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి ఉచిత వెల్కమ్ ఆఫర్ను మార్చి 2017వరకు కొనసాగిస్తారని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషకులు చెప్పారు. ఇంటర్కనెక్షన్ పాయింట్లో మెరుగుదల కనిపించని పక్షంలో, నాణ్యత మెరుగుపరిచే వరకు కస్టమర్లు ఎలాంటి చార్జీలను చెల్లించాల్సినవసరం ఉండదు. ఇది ట్రాయ్ నిబంధనలకు, రిలయన్స్ జియోలకు మధ్య కొంత సంఘర్షణకు దారితీసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వెల్కమ్ ఆఫర్ పేరును మార్చి, ఉచిత డేటా, కాల్స్ను కస్టమర్లకు కొనసాగించడానికి జియో సన్నాహాలు చేస్తున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.