'కాపులపై కేసులు పెడితే జైళ్లు సరిపోవు'
Published Mon, Oct 3 2016 10:12 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమాలు, ఆందోళనకారులపై పీడీ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్) పెట్టయినా అణచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడాన్ని కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఆక్షేపించారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులపై పీడీ యాక్ట్ పెట్టాలని చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవన్నారు. జైళ్లకు, బెయిళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యమాలను అణచివేయడంలో చంద్రబాబుది అందవేసిన చేయ్యేనని, తాము చేస్తున్నది న్యాయమైన పోరాటమైనందున ఎవ్వరికీ భయపడబోమన్నారు. రిజర్వేషన్ల పోరాట భవిష్యత్ కార్యచరణను చర్చించేందుకు నగరానికి వచ్చిన ముద్రగడ, ఆయన అనుచరులు సోమవారం కాపు రిజర్వేషన్లకు మద్దతిస్తున్న వివిధ వర్గాల మేథావులను, ఇతర బీసీ సంఘాల నేతల్ని కలిశారు.
ఈ సందర్భంగా ఆయన తన పోరాట నేపథ్యాన్ని వివరించారు. దీక్ష సందర్భంగా తనపైన, తన కుటుంబ సభ్యులపైన పోలీసుల అనుచిత ప్రవర్తనను వివరించారు. తనను ఎంతగా క్షోభ పెట్టినా రిజర్వేషన్ల సమస్యను విడిచిపెట్టే సమస్యే లేదన్నారు. తమ పోరాటం మిగతా బీసీ వర్గాలకు వ్యతిరేకమైందో, వారికిస్తున్న రిజర్వేషన్ల కోటాను లాక్కోవాలన్నదో కాదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న రిజర్వేషన్లనే అమలు చేయమని కోరుతున్నామని, చంద్రబాబు కాపు వర్గాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తున్నామని వివరించారు. బీసీ కమిషన్ ఛైర్మన్ మంజునాధ్‌కు ఇప్పటికే తమ సమస్యలను వివరిస్తూ మహాజర్లు ఇచ్చామని, ఆయన ఏ జిల్లాకు వెళ్లినా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల వారు వినతి పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్‌లో చేపట్టబోయే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ముద్రగడ అన్ని వర్గాల ప్రజలను, పార్టీల నాయకులను కోరారు.
కాపు ప్రముఖులతో మంగళవారం భేటీ
రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన రిజర్వేషన్ల పోరాట సమితీ జేఏసీల సమావేశం తీర్మానాలను చర్చించి భవిష్యత్ కార్యచరణను ఖరారు చేసేందుకు మంగళవారం ఇక్కడ కాపు ప్రముఖుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముద్రగడతో పాటు కాపు ప్రముఖులు, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు, ప్రముఖ నటుడు చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, వైఎస్సార్ సీపీ నాయకులు బొత్సా సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, కఠారి అప్పారావు, సీహెచ్ జనార్ధన్ తదితరులు హాజరవుతారు. కాపు రిజర్వేషన్ల పోరాట సమితీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర స్థాయి జేఏసీ ఏర్పాటు వంటి అంశాలను సమావేశంలో చర్చిస్తారు.
Advertisement
Advertisement