ప్రియాంకపై ఆయన వ్యాఖ్యలు ఊహించినవే
పనాజీ: ప్రియాంక గాంధీ అందం గురించి బీజేపీ నేత వినయ్ కతియార్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. కతియార్ వ్యాఖ‍్యలు అభ్యంతరకరమని, అయితే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఆయన నుంచి ఇలాంటి మాటలు రావడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు.
‘ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి కతియార్ వచ్చారు. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన కతియార్ నుంచి ఇలాంటి మాటలను ఊహించాను. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నా’ అని దిగ్విజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ ప్రచారం గురించి కతియార్ మాట్లాడుతూ.. ‘ఆమె స్టార్ కాంపెయినర్ ఏంటి? ప్రియాంక కంటే అందమైన మహిళ నేతలు ప్రచారం చేయనున్నారు. ఈ జాబితాలో హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇంకా అందమైన మహిళలు ఉన్నారు’ అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.