ప్రత్యూషకు కేసీఆర్ దంపతుల పరామర్శ
హైదరాబాద్: సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరామర్శించారు. శనివారం మధ్యాహ్నం సరూర్ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్కు కేసీఆర్ దంపతులు వెళ్లారు. కేసీఆర్ దంపతులతో పాటు వారి కుమార్తె, ఎంపీ కవిత కూడా వచ్చారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యూషకు సంబంధించి అన్ని విషయాలను ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని కేసీఆర్ చెప్పారు.
ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రత్యూషను కేసీఆర్ దంపతులు కలవాల్సి ఉన్నా నగరంలో పుష్కరాల వాహనాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ తో ఆయన ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు. ప్రత్యూషను అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఓ సామాన్యురాలిని పరామర్శించడం.. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు.
మీడియాలో ప్రత్యూషపై వచ్చిన కథనాలు చూసి చలించిపోయిన కేసీఆర్ అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. తల్లిని కోల్పోయిన ప్రత్యూషను ఎవరూ చేరదీయకపోవడం పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన చెందారు. సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలు భరిస్తూ ఆమె నరకం చూసిందంటూ ఇంతకుముందు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ప్రత్యూష పరిస్థితి తనకు తరచూ గుర్తుకొస్తోందన్నారు. దీంతో ప్రత్యూష కు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు.