
గ్యాస్ దారిలోనే కిరోసిన్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కేంద్రం, పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాయితీపై సరఫరా చేస్తున్న కిరోసిన్ విషయంలోకూడా ఇదే విధానాన్ని అనుసరించాలనే యోచనలో ఉంది. కిరోసిన్ సరఫరాలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు నగదు బదిలీనే ఉత్తమ మార్గమని ఇప్పటికే పలు కేంద్ర సంస్థలు తేల్చిచెప్పగా, తాజాగా కేంద్ర వ్యయ నిర్వహణ కమిషన్ సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పడంతో కేంద్రం ఆ దిశగా ఆలోచన చేసింది.
రాష్ట్రాల్లోని ఆయిల్ కంపెనీలను సంప్రదించి, ఆధార్, బ్యాంకు సీడింగ్ వివరాలన్నీ లెక్క తీశాక దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. వంటగ్యాస్ రాయితీపై వేల కోట్లు వెచ్చిస్తున్నా అందులో 25 నుంచి 30 శాతం మేర నిధులు అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్నాయని గుర్తించిన కేంద్రం ఈ ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా నగదు బదిలీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో నగదు బదిలీ కోసం ఆధార్, బ్యాంకు ఖాతాలను అనుసంధానించిన 61.99 లక్షల మంది లబ్ధిదారులకి రాయితీ నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతోంది.
ఇదే విధానాన్ని కిరోసిన్‌కు వర్తింపజేయాలని గత ఏడాది కేంద్రం భావించినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం దీనిపై ఆయిల్ కంపెనీల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇటీవలే పెట్రోలియం శాఖ అధికారులు కిరోసిన్‌కు నగదు బదిలీ విషయమై ఆయిల్ కంపెనీల అభిప్రాయాలను సేకరించగా వారు ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌లో లీటర్ కిరోసిన్ రూ.59 వరకు ఉండగా, కేంద్రం రూ.34 రాయితీని భరించి రూ.15కే లబ్ధిదారులకు ఇస్తుంది.
రాష్ట్రం పరిధిలో పంపిణీ చేస్తున్న కిరోసిన్‌పై పడుతున్న రాయితీ భారం ఏటా రూ.660 కోట్ల వరకూ ఉంటోంది. అయితే రాయితీ కిరోసిన్ బ్లాక్‌మార్కెట్‌ను అడ్డుకునేందుకు లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ జమ చేయడమే మేలని అధికారులు సూచిం చారు. రాష్ట్రంలో ఆధార్ సీడింగ్ దాదాపు పూర్తి కావడం, 80% మందికి బ్యాంకు ఖాతాలు ఉండటంతో నగదు బదిలీని అమలు చేయడం ప్రయోజనకారిగా ఉంటుందని తెలిపినట్లు సమాచారం.