
సీఎంను బర్తరఫ్ చేయాలి: టి. హరీష్‌రావు
వరంగల్, న్యూస్‌లైన్: అధికార కార్యాలయంలో కూర్చొని తెలంగాణపై విషం కక్కుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హతలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు పేర్కొన్నారు. రాగద్వేషాలకతీతంగా పనిచేస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఆయన తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో శుక్రవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్ పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని, 24గంటల్లో ఆయన క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. మట్టిమారినంత మాత్రాన చెట్టుమారదని కిరణ్ నిరూపించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించిన ఆయన 13 జిల్లాలకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
దిగ్విజయ్‌సింగ్‌ను, సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్న ఆయనను తొలగించకుండా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దని కోరారు. సీమాంధ్రలో సమ్మెను కిరణ్ నడిపిస్తున్నారని, ఉద్యమానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నీటి పంపిణీ గురించి చెబుతున్న ముఖ్యమంత్రి మాటల్లోనే ఇంతకాలం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా రాకుండా చేశారని తేలుతోందన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను సక్రమంగా పంపిణీ చేసుకోవాలంటే సమైక్య రాష్ట్రంగా ఉండాలంటున్నారని, అలాగైతే కర్నాటక, మహారాష్ట్రను కూడా కలపాలంటారా? అని ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మించలేదని, దేశానికి స్వాతంత్య్రం రాకముందే 1903లో నిజాం ప్రభుత్వం దీనిపై సర్వే చేయించిందని, 1953లో డిజైన్ రూపొందించారని, 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేసిన విషయం సీఎంకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు.
మూడు వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలుకావడానికి మీ పాలన కారణం కాదా? అంటూ హరీష్ నిలదీశారు. సీమాంధ్ర ప్రయోజనాలు ముఖ్యమంటున్న కిరణ్‌కు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదా? ఇక్కడి వారు రాష్ట్ర ప్రజలు కాదా? అంటూ ప్రశ్నించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, పోలవరం, పులిచింతల ప్రాజెక్టు ఏదైనా ముంపు మాది.. పారకం మీది అనే తీరుగా మారిందన్నారు. ముఖ్యమంత్రి తీరు చూసిన తర్వాతనైనా తెలంగాణ మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వాదులు మా బతుకుతో పాటు మీ బతుకు కోరుతామని, కానీ మీరు మాత్రం దీనికి భిన్నంగా సీమాంధ్ర పచ్చగుండాలే..తెలంగాణ ఎండిపోవాలని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీమాంధ్ర ఉద్యమానికి ప్రజల మద్దతు లేనందున ఉద్యోగులతో సమ్మె చేయిస్తున్న కిరణ్‌కుమార్ ప్రైవేటు సంస్థలను ఎందుకు బంద్ చేయించడం లేదన్నారు. లగడపాటి ల్యాంకో, చంద్రబాబు హెరిటేజ్, దివాకర్‌రెడ్డి బస్సులు నడుస్తూనే ఉన్నాయన్నారు.
పెట్టుబడిదారుల ఏజెంట్ అశోక్‌బాబు
ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు పెట్టుబడిదారులకు ఏజెంట్‌గా మారారని, ఆయన కాల్‌లిస్ట్ తీస్తే ఇవన్నీ వెలుగు చూస్తాయన్నారు. సీఎంగా ఉండగా 52 చోట్ల ఎన్నికలు జరిగితే 50 స్థానాల్లో కాంగ్రెస్ ఓటమిపాలయ్యారని హరీష్‌రావు గుర్తుచేశారు. ‘‘నీ పాలన, నీ ముఖం బాగాలేకనే ప్రజలు తిరస్కరించారని’’ కిరణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యమం సన్నగిల్లుతున్న సమయంలో ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రక్రియ ఆగదని కిరణ్ పరోక్షంగా అంగీకరిస్తున్నారన్నారు.
బిల్లు పార్లమెంట్, అసెంబ్లీలోకి వస్తే వ్యతిరేకించాలని చెప్పడంలోనే బిల్లు వస్తుందనే అంశం దాగి ఉందన్నారు. తన పనైపోయిందని గ్రహించిన ఆయన ఈ విమర్శలు చేస్తున్నారని హరీష్‌రావు అన్నారు. చివరి బంతి పార్లమెంట్‌లో బిల్లుపెట్టడమేనన్నారు. సీఎం పెవిలియన్‌కు చేరుకోవడం ఖాయమన్నారు. కిరణ్‌ను తెలంగాణ ప్రజలు వదిలిపెట్టబోరని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, వినయ్ భాస్కర్, భిక్షపతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రావు పాల్గొన్నారు.