కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో కోన గ్రామంలో జరిగిన సీన్ రిపీటైంది.
మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్లకు చుక్కెదురు.. బుద్దాలపాలెంలో కుర్చీలు విసిరేసిన గ్రామస్థులు
సాక్షి, మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో కోన గ్రామంలో జరిగిన సీన్ రిపీటైంది. బుద్దాలపాలెంలో భూసేకరణపై మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులకు చుక్కెదురైంది. స్థానిక ఎంపీయూపీ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి కొల్లు మాట్లాడుతూ అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ చేస్తున్నామని, భూములు సేకరిస్తామే తప్ప గ్రామాలను ఖాళీ చేయించబోమని చెప్పారు.
ఈ సందర్భంగా రైతులు స్పందిస్తూ.. ‘మాతో సంప్రదింపులు జరపకుండా మీ ఇష్టానుసారం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామంలో ఒక్క సెంటు భూమి కూడా పరిశ్రమల స్థాపన కోసం ఇచ్చేది లేదు. అప్పటి వరకు ఈ సమావేశంలో మాట్లాడవద్దు’ అంటూ అడ్డుతగిలారు. ‘భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాతే మీరు గ్రామానికి రావాలి.
అప్పటివరకు మీ మాటలు వినేది లేదు. తక్షణమే ఈ సభను రద్దు చేయాలి’ అని గ్రామస్థులు నినాదాలు చేశారు. అయినప్పటికీ మంత్రి మాట్లాడబోతుండగా కోపోద్రిక్తులైన గ్రామస్థులు వారి ఎదురుగా ఉన్న కుర్చీలను పైకి విసిరేశారు. సమావేశం జరిగే అవకాశం లేకపోవటంతో మంత్రి, ఎంపీ వెనుదిరిగారు.