
చెవులు కుట్టించుకో.. గుండు గీయించుకో!
సుశీల్ మోదీ ట్వీట్‌కు లాలూ ఘాటు పంచ్!
పట్నా: ట్విట్టర్ వేదికగా ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ మధ్య నిత్యం వ్యంగ్యాస్త్రాలు, మాటల యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా ఈ ఇద్దరు నేతలు మరోసారి దూసుకున్నారు. ట్విట్టర్ వేదికగా పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా తదితరుల సమక్షంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూపై సుశీల్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
’యోగి సీఎం కావడంతో ఆయనను ఎలా తిట్టాలో కూడా తెలియని దిగ్భ్రాంత స్థితిలో లాలూ ఉన్నారు’ అటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు అంతే ఘాటుగా స్పందించిన లాలూ.. ’నువ్వు కూడా చెవులు కుట్టించుకో. గుండు గీయించుకో. దుస్తులు మార్చుకో. ఇది నీకు మేలు చేయవచ్చు. (ప్రమాణస్వీకారానికి) నిన్ను పిలువలేదని మరీ బాధపడిపోకు’ అంటూ చురకలు అంటించారు. నువ్వు కూడా సన్యాసం స్వీకరిస్తే బాగుపడే చాన్సుందని పరోక్షంగా సూచిస్తూ లాలూ పేల్చిన ఈ వ్యంగ్యాస్త్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నది. సుశీల్‌మోదీకి ఇది అద్భుతమైన పంచ్ అని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం ఇటీవల లాలూ-మోదీ ట్వీట్ సంవాదం కొనసాగిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ తిరుగులేని విజయాలు సాధించడంతో.. నేరుగా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, 'లాలూ మీ పరిస్థితి ఏమిటి' అంటూ ఓ చిన్న ట్వీట్ చేశారు సుశీల్ మోదీ. దానికి లాలు చాలా షార్ప్‌గానే రియాక్ట్ అయ్యారు. 'నేను బాగానే ఉన్నా. నిన్నే యూపీలోకి అడుగుపెట్టనివ్వలేదు కాబట్టే.. అక్కడ బీజేపీ గెలువగలిగింది’ అంటూ కౌంటర్ ఇచ్చారు.