
భూమిని దాటనున్న భారీ ఉల్క!
వాషింగ్టన్: ఈ నెల 19న భారీ సైజున్న ఓ ఉల్క భూమిని దాటనుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. ఇది భూమికి దాదాపు 18 లక్షల దూరం నుంచి వెళ్లిపోనుందని పేర్కొంది. ఇది భూమిని ఢీకొనే ప్రమాదం లేకపోయినా ఓ భారీ ఉల్క భూమికి ఇంత దగ్గరగా వెళ్లడం ఇదే ప్రథమం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని 2014 మేలో గుర్తించడం వల్ల దీనికి 2014 జేఓ25 అని నామకరణం చేశారు. ఈ ఉల్క దాదాపు 650 మీటర్ల పొడవు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ఉపరితలం చంద్రుడి ఉపరితలం కంటే రెట్టింపు ప్రకాశవంతంగా ఉందని చెబుతున్నారు.
ఏప్రిల్ 19న అర్ధరాత్రి దీన్ని ఆకాశంలో చూడవచ్చట! చిన్న చిన్న ఉల్కలు మన భూమిని వారానికి పలుసార్లు దాటుతూ ఉంటాయి. దీని తర్వాత మరో పెద్ద ఉల్క 2027లో భూమిని దాటుతుందని అంచనా వేస్తున్నారు. 1999 ఏఎన్10 అనే పేరున్న ఉల్క భూమికి దాదాపు 3.8 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 19నే పాన్ స్టార్స్ అనే తోకచుక్క కూడా భూమికి 17.5 కోట్ల కిలోమీటర్ల దగ్గరగా రానుంది. ఆ తోకచుక్క భూమికి అంత దగ్గరగా రానుండటం కూడా ఇదే ప్రథమం.