రాహుల్, మాల్యా, బర్కాలకు షాక్ ఇచ్చింది వీరే
రాహుల్, మాల్యా, బర్కాలకు షాక్ ఇచ్చింది వీరే
Published Mon, Dec 12 2016 5:08 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
దేశంలో ప్రముఖులు, సంపన్నుల ట్విట్టర్ అకౌంట్లు, ఈ-మెయిల్ సర్వర్లను హ్యాక్ చేస్తున్న హ్యాకింగ్ బృందాన్ని ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, విజయ్ మాల్యా, ప్రముఖ జర్నలిస్టు బర్కా దత్ ల ట్విట్టర్ అకౌంట్లు, ఈ-మెయిళ్ల సర్వర్లు హ్యాక్ చేసింది ఈ బృందమేనని వెల్లడించారు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నేతల అంతర్గత ఈ-మెయిళ్లను బహిర్గతం చేస్తామని లెజియన్ హ్యాకర్లు బృందం పేర్కొంది.
బ్యాంకులకు రూ.7వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు బుద్ధి చెప్తామని కూడా హ్యాకర్లు పేర్కొన్నారు. ఈ ఘటనలపై దృష్టి సారించిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు హ్యాకర్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
'లెజియన్' అంటే?
ఐదు దేశాల్లో ఉన్న పలువురు వ్యక్తులతో(హ్యాకర్లు) ఏర్పడిన బృందమే లెజియన్. అమెరికా, స్వీడన్, కెనడా, థాయ్ లాండ్, రొమెనియా దేశాల నుంచి వీరందరూ హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. తమ బృందాన్ని మరింత విస్తృత పరచుకునేందుకు ఆసక్తి గల హ్యాకర్లు legion_group@sigaint.orgకు మెయిల్ చేయాలనే ఒక సందేశాన్ని వారు వదిలినట్లు చెప్పారు.
అయితే, ఈ హ్యాకర్లకు 'లెజియన్ ఆఫ్ డూమ్ ఆఫ్ ది 1980' బృందానికి ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించారు. 2000వ దశకంలో ప్రముఖుల ఈ-మెయిల్ అకౌంట్ లను హ్యాక్ చేస్తూ బెంబేలెత్తించారు. కానీ, ఇరు బృందాలు హ్యాకింగ్ కు పాల్పడటానికి గల బలమైన కారణం ప్రముఖ ధనికుల అవినీతిని బయటపెట్టడం.
లెజియన్ ఎందుకు హ్యాకింగ్ చేస్తోంది?
ప్రపంచంలో అవినీతిని బయటపెట్టడం కోసమే లెజియన్ ఏర్పడింది. కానీ, ఈ బృందం అవినీతికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యకలాపాలు ఏవీ ఇప్పటివరకూ బయటకు రాలేదు.
లెజియన్ ఎలా పని చేస్తుంది?
సాధారణ సర్వర్ల ద్వారా కాకుండా ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారో కనుగొనలేని సర్వర్లు, బ్రౌజర్ల ద్వారా లెజియన్ పని చేస్తోంది. అంటే సాధారణ బ్రౌజర్లైన గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ల ద్వారా కాకుండా 'ది ఆనియన్ రౌటర్(టీఓఆర్)' అనే బ్రౌజర్ ద్వారా వీరు నెట్ ను వినియోగిస్తారు. దీన్నే డార్క్ నెట్ అని కూడా అంటారు. దీన్ని కొంతమంది యాక్టివిస్టులు, జర్నలిస్టులు ఉపయోగిస్తుంటారు.
ఇలాంటి హ్యాకింగ్ సంస్ధలు ఇంకా ఉన్నాయా?
అవును. ఇలాంటి సంస్ధలు ఇంకా ఉన్నాయి. 2003లో వివిధ దేశాలకు చెందిన యాక్టివిస్టులు, హ్యాక్టివిస్టులు కలిసి అసోసియేటెడ్ ఇంటర్నేషనల్ నెట్ వర్క్ పేరిట ఓ సంస్ధను ప్రారంభించారు. ఇలాంటి సంస్ధల్లో ఒకరు ఈ పని చేయాలని ఎవరూ సూచించరు. కేవలం తమ వద్ద ఉన్న ఆలోచనలను పంచుకుని వాటిని కార్యరూపం దాల్చేలా చేయడానికి యత్నిస్తారు. ఈ గ్రూపు పెద్ద ఎత్తున ప్రభుత్వ వెబ్ సైట్లు, కార్పొరేట్, మత గ్రూపులకు చెందిన సైట్లను పలుమార్లు క్రాష్ చేశాయి.
Advertisement