ఆ ఉగ్రకోరల దాడి పాక్ నుంచే | Lood-bath ephaie Pakistan on Mumbai revealed that the former dig | Sakshi
Sakshi News home page

ఆ ఉగ్రకోరల దాడి పాక్ నుంచే

Published Tue, Aug 4 2015 11:28 PM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM

ఆ ఉగ్రకోరల దాడి పాక్ నుంచే - Sakshi

ఆ ఉగ్రకోరల దాడి పాక్ నుంచే

ముంబై మారణహోమంపై పాక్ ఎఫ్‌ఐఏ మాజీ డీజీ వెల్లడి
26/11 దాడికి కుట్ర జరిగింది పాక్ భూభాగంలోనే..
కసబ్ పాక్ జాతీయుడే.. ఉగ్రవాదులను థట్టా నుంచే దాడికి పంపారు
కరాచిలోని ఒక ఆపరేషన్ గది నుంచి దాడికి మార్గదర్శకం చేశారు
ముంబై ఉగ్రవాద దాడిపై పాక్ వాస్తవాన్ని, పొరపాట్లను ఒప్పుకోవాలి
డాన్ పత్రికలో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాజీ డీజీ తారిక్

 
ఇస్లామాబాద్: భారత్‌పై పంజా విసురుతున్న ఉగ్రవాదానికి, తమ దేశంతో ఏ సంబంధం లేదని దబాయిస్తున్న పాకిస్తాన్ కపటనీతి బట్టబయలయింది. ముంబై నగరంలో 166 మందిని బలితీసుకుని మారణహోమం సృష్టించిన 26/11 ఉగ్రదాడికి కుట్ర జరిగింది పాక్‌లోనే అని, పాక్ భూభాగం నుంచే ఆ దాడి జరిగిందని.. ఆ దేశానికి చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) మాజీ అధిపతి స్వయంగా బహిర్గతం చేశారు. కరాచీలోని ఒక గది నుంచి ఆ దాడికి మార్గనిర్దేశం జరిగిందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎన్నో ఆధారాలు దర్యాప్తులో లభ్యమయ్యాయని వివరించారు. 2008లో ముంబైపై ఉగ్రవాద దాడి తర్వాత కొన్ని వారాల్లోనే ఎఫ్‌ఐఏ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన తారిక్ ఖోసా మంగళవారం పాక్‌కు చెందిన డాన్ దినపత్రికలో రాసిన వ్యాసంలో.. ఆ దాడుల దర్యాప్తులో వెల్లడైన అంశాలను, దర్యాప్తును నీరుగార్చేందుకు జరిగిన ప్రయత్నాలను కూలంకషంగా వివరించారు.

తద్వారా ముంబైపై జరిగిన దాడి విషయంలో భారత్ ఇంత కాలం చెప్తున్నదంతా వాస్తవమేనని ధ్రువీకరించారు. తన భూభాగంలో కుట్ర చేసి, అమలు చేసిన ముంబై మారణహోమాన్ని పాక్ పట్టించుకోవాల్సి ఉందని.. ఇందుకు వాస్తవాన్ని ఒప్పుకోవటం, పొరపాట్లను అంగీకరించటం అవసరమని సూచించారు. ఆ ఘోర ఉగ్రవాద దాడుల సూత్రధారులు, పాత్రధారులను పాక్ ప్రభుత్వ భద్రతా సంస్థలు చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఉగ్రవాదులు, తీవ్రవాదులందరితో సహా మంచి తాలిబాన్ చెడ్డ తాలిబాన్ అనే తేడా చూపించటాన్ని, ద్వంద్వ వైఖరిని పాక్ సర్కారు విడనాడాలని హితవుపలికారు. ‘ముంబై దాడుల కేసు సుదీర్ఘ కాలం పాటు సాగుతూ వస్తోంది. నిందితులు జాప్యం చేసే ఎత్తుగడలు, విచారణ జీడ్జీలను తరచుగా మార్చుతుండటం, ప్రాసిక్యూటర్ హత్యకు గురవటం, కొందరు కీలక సాక్షులు వాస్తవంగా ఇచ్చిన వాంగ్మూలానికి ఎదురు తిరగటం అనేవి కేసు విచారణకు గట్టి ఎదురుదెబ్బలుగా మారాయి’ అని వెల్లడించారు. పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య గత నెలలో రష్యాలో జరిగిన సమావేశాన్ని పాక్ ప్రజలు ఆహ్వానించాలని సూచించారు. ఈ భేటీ అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. ఐదు సూత్రాల రోడ్‌మ్యాప్‌ను పేర్కొన్నారు. ముంబై కేసు విచారణను (పాక్‌లో) వేగవంతం చేసేందుకు.. మాటల నమూనాలను అందించటం సహా ఉన్న మార్గాలపై చర్చించాలని అంగీకరించారు. కానీ.. పాకిస్తాన్ ఆ తర్వాత మాట మార్చింది. ఈ కేసుకు సంబందించి మరిన్ని సాక్ష్యాలు, సమాచారం కావాలని భారత్‌ను అడిగింది.

 ఇరు దేశాలూ కలిసి కృషిచేయాలి...
 ‘ఈ దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కమాండర్, అతడి సహాయకుల  స్వర నమూనాలను పరీక్షల కోసం రికార్డు చేసేందుకు అనుమతించాలని దర్యాప్తు అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ నిందితులు తిరస్కరించారు. వారి అంగీకారం లేకపోయినా వారి  స్వర నమూనాలను రికార్డు చేసేందుకు అనుమతించాలని అధికారులు కోర్టును కోరారు. కానీ.. సాక్ష్యాల చట్టం లేదా అప్పటికి అమలులో ఉన్న ఉగ్రవాద వ్యతిరేక చట్టంలో అటువంటి అంశమేదీ లేదన్న ప్రాతిపదిక మీద కోర్టు ఆ వినతిని కోర్టు తిరస్కరించింది. దీంతో  అధికారులు పైకోర్టుకు వెళ్లారు. 2013లో అమలులోకి వచ్చిన నిష్పాక్షిక విచారణ చట్టం.. ఇటువంటి సాంకేతిక సాక్ష్యాన్ని అనుమతిస్తోంది. కానీ.. అంతకుముందు కాలం నుంచే ఇది వర్తిస్తుందా లేదా అన్నది చర్చించాల్సిన ప్రశ్న’ అని వివరించారు. ‘ముంబై కేసు విభిన్నమైనది. ఒక ఘటన, రెండు న్యాయపరిధులు, రెండు విచారణలతో కూడుకున్న కేసు. రెండు దేశాల న్యాయ నిపుణులు.. పరస్పరం ఆరోపణలు చేసుకోవటానికి బదులు.. కలిసి కృషి చేయాలి’ అని అన్నారు.
 
థట్టాలో శిక్షణ ఇచ్చి పంపించారు
 
పాక్‌లోనూ, ఇంటర్‌పోల్‌లోనూ పలు ఉన్నత స్థానాల్లో పనిచేసిన తారిక్ ఖోసా 2007లో జరిగిన పాక్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్‌భుట్టో హత్య కేసు దర్యాప్తుకు కూడా సారథ్యం వహించారు. ముంబైపై 26/11 దాడికి సంబంధించి తారిక్ వెల్లడించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

‘‘మొదటిది.. అజ్మల్ కసబ్ పాకిస్తానీ జాతీయుడు. అతడి నివాస స్థలం, మొదట్లో చదువుకున్న ప్రాంతం, నిషిద్ధ ఉగ్రవాద సంస్థలో అతడు చేరటం మొదలైన అంశాలను దర్యాప్తు అధికారులు నిరూపించారు.

రెండోది.. ఆ లష్కరే తోయిబా ఉగ్రవాదులకు సింథ్‌లోని థట్టా వద్ద శిక్షణనిచ్చారు. అక్కడి నుంచే వారిని సముద్రమార్గం ద్వారా పంపించారు. ఆ శిక్షణ శిబిరాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించి, స్వాధీనంలోకి తీసుకున్నారు కూడా. ముంబైలో వినియోగించిన పేలుడు పదార్థాల పైమూతలను (కేసింగ్స్‌ను) ఈ శిక్షణ కేంద్రం నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగింది.
 
మూడోది.. ఉగ్రవాదులు బయల్దేరినపుడు సముద్ర ప్రయాణంలో తొలుత వినియోగించిన ఫిషింగ్ ట్రాలర్ (చేపల వేటకు వినియోగించే మర పడవ)ను మళ్లీ వెనక్కు ఓడ రేవుకు తీసుకువచ్చి, కొత్త రంగు వేసి దాచిపెట్టారు. దానిని స్వాధీనం చేసుకోవటం జరిగింది. దానితో నిందితులకు సంబంధముందన్న నిర్ధారణ జరిగింది.
 
నాలుగోది.. ముంబై రేవు వద్ద ఉగ్రవాదులు వదిలేసి వెళ్లిన డింగీ (చిన్న మర పడవ)లోని ఇంజన్‌కు ఒక పేటెంట్ నంబర్ ఉంది. దాని ద్వారా ఆ ఇంజన్ జపాన్‌లో తయారై, లాహోర్‌కు చేరుకుని.. అక్కడి నుంచి కరాచీలోని ఒక క్రీడావస్తువుల దుకాణానికి చేరుకుందని, దానిని అక్కడ లష్కరే తోయిబాతో సంబంధమున్న ఒక ఉగ్రవాది ఆ ఇంజన్‌ను డింగీతో సహా కొన్నాడని తేలింది.
 
ఐదోది.. ముంబై దాడికి ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేసిన కరాచీలోని ‘ఆపరేషన్ రూమ్’ను దర్యాప్తు అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకోవటం జరిగింది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) ద్వారా సంభాషణలు జరిగాయని బహిర్గతమయింది.
 
ఆరోది.. ఈ ముంబై దాడికి సంబంధించిన కమాండర్, అతడి సహాయకులను గుర్తించి, అరెస్ట్ చేయటం జరిగింది.
 ఏడోది.. ఈ దాడికి ఆర్థిక నిధులు, సదుపాయాలు సమకూర్చిన ఇద్దరు విదేశీ ఫైనాన్షియర్లు, ఫెసిలిటేటర్లను అరెస్ట్ చేసి, విచారణ కోసం తీసుకురావటం జరిగింది.’’
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement