మహీంద్రా ధరలూ పెరిగాయ్
న్యూఢిల్లీ: రూపాయి క్షీణతతో ధరల భారాన్ని వాహన కంపెనీలు వినియోగదారుని నెత్తిన వేయాలని నిర్ణయించాయి. రూపాయి పతనానికి తోడు ముడిసరుకుల ధరలు కూడా పెరిగి ఉత్పత్తి వ్యయాలు అధికం కావడంతో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, పలు వాహన కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా, ధరలను పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామని బజాజ్ ఆటో పేర్కొంది. మహీంద్రా కంపెనీ ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలను రూ.6,000 నుంచి రూ.20,000 వరకూ పెంచుతోంది. ఈ పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. ఈ కంపెనీ స్కార్పియో, ఎక్స్‌యూవీ 500, బొలెరో, వెరిటోతో పాటు పలు రకాల వాహనాలను తయారు చేస్తోంది.
త్వరలోనే పెంపు: రూపాయి విలువ క్షీణించడంతో ఉత్పత్తి వ్యయం పెరగిందని... ధరలు పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. ఇప్పటికే మారుతీ, హ్యుందాయ్, జీఎం, టయోటా, మెర్సిడెస్ బెంజ్, ఆడి తదితర కంపెనీలు ధరలను పెంచగా, ధరల పెంపు విషయమై తీవ్రం గానే పరిశీలిస్తున్నామని టాటా మోటార్స్ పేర్కొంది.