బిగ్‌సీ మేనేజరే సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో దోపిడీ దొంగల కాల్పుల వెనుక కొత్త కోణం బయటకొచ్చింది! ఈ భారీ దోపిడీకి స్కెచ్ వేసింది బిగ్‌సీలోనే పనిచేస్తున్న మేనేజర్ మహమ్మద్ సమీయుద్దీనేనని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. గుల్బర్గాలో నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన మీర్జా మహమ్మద్ అబ్లుల్లా బేగ్ అలియాస్ ఫహీమ్ మీర్జాతో ఏడేళ్ల క్రితం టోలిచౌకివాసి సమీయుద్దీన్‌కు పరిచయం ఏర్పడింది.
బిగ్‌సీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సమీయుద్దీన్... కార్యాలయం నుంచి రోజూ లక్షలాది రూపాయలను క్యాష్ కలెక్షన్ బాయ్స్ తీసుకువెళ్తుండడం గమనించాడు. ఈ విషయాన్ని ఫహీమ్ మీర్జాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో మీర్జా.. తన స్నేహితులు అబ్దుల్ ఖదీర్, సలీమ్‌తో కలిసి ఈనెల 17న గుల్బర్గా నుంచి హైదరాబాద్ వచ్చాడు. రెండు దేశవాళీ తుపాకులు, పది రౌండ్లతో నగరానికి వచ్చి సమీయుద్దీన్ ఇంట్లో మకాం పెట్టారు.
మీర్జా, ఖదీర్‌లు ద్విచక్ర వాహనంపై మాదాపూర్‌లోని బిగ్‌సీ ముందు రెక్కీ నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి, వారి కుట్రను భగ్నం చేశారు. గురువారం నాటి కాల్పుల్లో గాయపడిన మెట్రో కూలీ ధర్మేందర్‌సింగ్ ప్రాణానికి ముప్పు లేదని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. బీదర్‌లో జైల్లో ఉన్న సమయంలో నేరస్తులతో ఏర్పడిన పరిచయంతో మధ్యప్రదేశ్ నుంచి ఈ తుపాకులను కొనుగోలు చేశారని వివరించారు. ఫహీమ్ మీర్జాపై ఇప్పటికే నగరంలో ఆరుకుపైగా కేసులు, గుల్బార్గాలో నాలుగు కేసులు ఉన్నాయని తెలిపారు.
ఓ కన్నేసి ఉంచండి..
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులే దోపిడీ దొంగలతో కలిసి పనిచేస్తున్న సంస్థకే కన్నెం వేస్తున్నారని సీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి ప్రవర్తనతో పాటు వారి కదలికలపై నిఘా వేసి ఉంచడంవల్ల ఇలాంటి ఘటనలు ఆపవచ్చన్నారు.
పోలీసులకు రివార్డులు
ఈ ఆపరేషన్‌ను చాకచాక్యంగా నిర్వహించిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజా వెంకటరెడ్డి, ఎస్సైలు జలేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ గౌడ్, మల్లికార్జున్, ప్రభాకర్, కానిస్టేబుళ్లు జీషన్, వినయ్‌తో పాటు అతడి టీంను పోలీసు కమిషనర్ రివార్డులతో సన్మానించారు.