
అమెరికాకు నేడు ప్రధాని పయనం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చలు జరపడంతో పాటుగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. అంతే కాకుండా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది.
వాషింగ్టన్‌లో ఈ నెల 27న మన్మోహన్, ఒబామా మధ్య జరిగే చర్చల్లో పౌర అణు సహకార ఒప్పందం అమలు, రక్షణ రంగంలో సహకారాన్ని విస్తృతపరచుకోవడం, భద్రత, ఆర్థిక రంగాలకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధాని పర్యటన సందర్భంగా భారత అణు విద్యుత్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌పిసిఐఎల్) అమెరికా సంస్థ వెస్టింగ్‌హౌస్ మధ్య ఒప్పందంతో పాటుగా మరి కొన్ని ఒప్పందాలపై కూడా సంతకాలు జరగనున్నాయి. ఒబామాతో మన్మోహన్ సింగ్ శిఖరాగ్ర చర్చలు జరపడం 2009 నుంచి ఇది మూడోసారి.