నోట్ల రద్దు: మన్మోహన్ లేచి నిలబడగానే..!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో గురువారం కూడా గందరగోళ దృశ్యాలు పునరావృతమయ్యాయి. పెద్దనోట్ల రద్దుపై సభలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లేచి నిలబడి మాట్లాడేందుకు ఉద్యుక్తుడవుతుండగానే మళ్లీ గందరగోళం చెలరేగింది. దీంతో మన్మోహన్ నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడకముందే సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.
నోట్ల రద్దు అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ మాట్లాడుతారని కాంగ్రెస్ సభాపక్ష నేత ఆజాద్ డిప్యూటీ స్పీకర్ కురియన్‌కు తెలిపారు. మన్మోహన్ మాట్లాడితే ఎవరు వద్దన్నారంటూ కురియన్ బదులిచ్చారు. దీంతో మాట్లాడేందుకు మన్మోహన్ లేచి నిలబడ్డారు. ఇంతలోనే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకున్నారు. నోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చను తిరిగి ప్రారంభించాలనుకుంటే.. ప్రారంభించవచ్చునని, అంతేకానీ సంప్రదాయాలకు విరుద్ధంగా మరోసారి ప్రతిపక్షానికి ప్రత్యేక అవకాశం ఇవ్వకూడదని జైట్లీ పేర్కొన్నారు. కొత్త విధానాలు తీసుకురావొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో సభ వాయిదా పడింది.
వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగానే.. సంప్రదాయం ప్రకారం నోట్ల రద్దుపై మన్మోహన్ తిరిగి చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేశారని ప్రధాని మోదీ అంటున్నారని, కానీ ఆయన అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదని తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నోట్ల రద్దు ప్రవేశపెట్టిన విధానం సరిగ్గా లేదని కేంద్రాన్ని తప్పుబట్టారు. నోట్ల రద్దుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు సహకారం అందించే కోఆపరేటివ్ బ్యాంకులు కుదేలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మన్మోహన్ ప్రసంగంలోని కీలకాంశాలు
-
నోట్ల రద్దు అమలులో తీవ్రలోపాలు ఉన్నాయి.
-
60 నుంచి 65 మంది ప్రాణాలు కోల్పోయారు
-
నోట్ల రద్దుతో తీవ్రవాదులకు నిధులు అడ్డుకట్ట వేయగలమని చెప్తున్నారు.. దీనిని తిరస్కరించడం లేదు
-
నోట్ల రద్దుతో కరెన్సీ, బ్యాంకుల వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయారు.
-
ప్రధాని 50 రోజులు ఆగమంటున్నారు. కానీ పేదలకు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది.
-
నోట్ల రద్దు వెనుక ఉద్దేశాలను నేను వ్యతిరేకించడం లేదు.
-
ఈ విషయంలో ప్రజల కష్టాలు దూరం చేసేందుకు కొన్ని నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలతో ప్రధాని ముందు రావాలి.
-
బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే తిరిగి ఇవ్వలేని దేశం ఏదైనా ఉందా?
-
నోట్ల రద్దు వ్యవస్థీకృతమైన దోపిడీ జరుగుతోంది. చట్టపరంగా చేసిన భారీ తప్పిదం ఇది.
-
నోట్ల రద్దు కారణంగా జీడీపీ రెండుశాతం తగ్గింది. ఈ విషయంలో ఆర్బీఐని తప్పుబట్టడంలో సరైనదే.