విభజన సమయంలో 6 హామీలిచ్చా: మన్మోహన్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ శుక్రవారం సభలో మాట్లాడారు. ఏపీ విభజన సమయంలో తాను ఆరు హామీలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ హామీలపై అరుణ్ జైట్లీ కూడా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. నాడు ఇచ్చిన హామీలనుఅమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉందని మన్మోహన్ సింగ్ అన్నారు. విభజన హామీలను కేబినెట్ కూడా ఆమోదించిందని, ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ రావడం వల్ల ఆర్డినెన్స్ ఆగిపోయిందని మన్మోహన్ సింగ్ తెలిపారు.
మరోవైపు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై సభలో చాలాసార్లు చర్చించామన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆదుకునే విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి ఉందన్నారు. 14 వ ఆర్థిక సంఘం కొన్ని సిఫార్సులు చేసిందని, ఆ రాష్ట్రానికి మేలు చేసే మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సంతృప్తిపడేలా సమస్యను పరిష్కరిస్తామని జైట్లీ తెలిపారు. ఇప్పటికే ఏపీ ఎంపీలతో ప్రధాని మోదీ మాట్లాడారని ఆయన పేర్కొన్నారు.