ఇప్పటికీ కోమాలోనే పాకిస్థాన్!
భారత్‌కు హాని చేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్తాం
సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత తొలిసారి పరీకర్ స్పందన
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో నిర్దేశిత దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) నిర్వహించి.. ఎనిమిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భద్రతా దళాల శౌర్యప్రతాపాలను కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ ప్రశంసించారు. పీవోకేలో దాడుల తర్వాత తొలిసారి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే వారికి తగిన బుద్ధి చెప్తామని ఆయన స్పష్టం చేశారు.
’ఏ దేశాన్ని కబళించాలని మేం కోరుకోవడం లేదు. శ్రీరాముడు లంకను గెలిచి.. దానిని విభిషణుడికి ఇచ్చాడు. బంగ్లాదేశ్ విషయంలోనే మేం అదే చేశాం. మేం ఎవరికీ హాని తలపెట్టాలని కోరుకోం. కానీ ఎవరైనా హాని చేస్తే మాత్రం ఊరుకోం. తగినరీతిలో బుద్ధి చెప్తాం’ అని పరీకర్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను పాకిస్థాన్ తోసిపుచ్చుతున్న అంశంపై స్పందిస్తూ పీవోకేలో భారత ప్రత్యేక బలగాలు ప్రవేశించి దాడులు నిర్వహించడాన్ని పాక్ ఇంకా నమ్మలేకపోతున్నదని ఆయన పేర్కొన్నారు.
’సర్జరీ చేయించుకున్నవారిలాగే పాకిస్థాన్ కూడా ఇంకా కోమాలోనే ఉంది’ అని పేర్కొన్నారు. భారత్ మౌనాన్ని బలహీనతగా పాకిస్థాన్ భావించకూడాదని ఆ దేశాన్ని ఘాటుగా హెచ్చరించారు. లంకకు వెళ్లేముందు తన శక్తి ఏమిటో హనుమంతుడికి తెలియదని, అదేవిధంగా ఆర్మీ శక్తి ఏమిటో తాను తెలియజేశానని, ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు సైన్యం తన కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించిందని ప్రశంసించారు.