
బల పరీక్ష నెగ్గిన పరీకర్
⇒ గోవాలో 22–16 ఓట్ల తేడాతో విజయం
⇒ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
పణజి: గోవాలో మనోహర్ పరీకర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గురు వారం బల నిరూపణ పరీక్షలో నెగ్గింది. 22 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో బీజేపీ బలం నిరూపించు కుంది. బీజేపీ నుంచి 12 మంది, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ఎంజీపీల నుంచి ముగ్గురు చొప్పున, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఎన్సీపీ సభ్యుడు కలిపి మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. బీజేపీ ఎమ్మెల్యే సిద్ధార్థ్ ప్రొటెమ్ స్పీకర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె గైర్హాజరీతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి.
దీంతో 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం కోసం చివరి వరకు ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు. బీజేపీ బల పరీక్ష నెగ్గిన కొద్దిసేపటికే విశ్వజిత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ గోవా ప్రజలకు ద్రోహం చేసిందని విమర్శించారు. బల పరీక్ష నెగ్గిన అనంతరం పరీకర్ మాట్లాడుతూ.. మొదటి నుంచీ కాంగ్రెస్‌కు సరిపడా మెజారిటీ లేక పోయినా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ హడావిడి చేసిందని విమర్శిం చారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్లు వస్తుండటంతోనే ఈ హడావిడి జరిగిందని పేర్కొన్నారు.