న్యూఢిల్లీ: వాహన విక్రయాలు డిసెంబర్‌లో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొత్త ఏడాది ఒక నెల దూరంలోనే ఉండటంతో వినియోగదారులు డిసెంబర్‌లో వాహనాల కొనుగోళ్లకు ముందుకు రాలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. డిసెం బర్‌లో కొన్న వాహనాలను పాత ఏడాది మోడల్‌గానే గుర్తిస్తారని, రీసేల్ చేసేటప్పుడు ఇది ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వినియోగదారులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారని నిపుణులంటున్నారు.
మారుతీ సుజుకి, హ్యుందాయ్ కంపెనీల దేశీయ అమ్మకాలు మాత్రమే ఓ మోస్తరుగా పెరగ్గా, మిగిలిన కంపెనీల అమ్మకాలు తగ్గాయి. మందగమనాన్ని ప్రతిబింబిస్తూ మహీంద్రా, ఫోర్డ్ ఇండియా, టయోటా కిర్లోస్కర్, జనరల్ మోటార్స్ తదితర కంపెనీల అమ్మకాలు తగ్గాయి.
ప్రభుత్వమే దిక్కు
ప్రయాణికుల వాహనాల విక్రయాలు పుంజుకోవడంతో దేశీయ అమ్మకాలు 5.5 శాతం పెరిగాయని మారుతీ పేర్కొంది. ఇక గత సంవత్సరం తమకు సమస్యలతోపాటు ఊరటనిచ్చిన ఏడాదని హ్యుం దాయ్ మోటార్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రాకేష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 99 శాతం ఉపయోగించుకున్నామని, భారత్‌లో 50 లక్షల కార్లను అత్యంత వేగంగా ఉత్పత్తి చేయగలిగామన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ వాహన విక్రయాల్లో ప్రతికూల వృద్ధి నమోదైందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. ఆర్థిక కార్యకలాపాల తగ్గుముఖం, వినియోగదారుల, వాణిజ్యపరమైన సెంటిమెంట్లు బలహీనంగా ఉండడం దీనికి కారణమన్నారు. వాహన పరిశ్ర మను గట్టెక్కించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, లేదంటే కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. భారీస్థాయిలో డిస్కౌం ట్లు ఇచ్చినా, అమ్మకాలు మెరుగుపడలేదని జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ చెప్పారు.